మూలధన వివరాలూ రహస్యమేనా? | Sakshi
Sakshi News home page

మూలధన వివరాలూ రహస్యమేనా?

Published Wed, Sep 21 2016 3:29 AM

మూలధన వివరాలూ రహస్యమేనా? - Sakshi

* మిగిలిన విషయాలను ఎందుకు దాస్తున్నారు?
* బహిర్గతం చేయకపోవడంలో హేతుబద్ధత ఏమిటి?
* సర్కార్‌ను మరోసారి నిలదీసిన హైకోర్టు ధర్మాసనం
* ఆదాయం తక్కువగా ఉన్నా ముందుకే: అడ్వొకేట్ జనరల్

సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం మూలధన పెట్టుబడులకు సంబంధించిన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య సమాచారం (ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్)గా పేర్కొనడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మూలధనం, ఆదాయ వివరాలు కూడా యాజమాన్య సమాచారమంటే ఎలా?

అసలు ఈ వివరాలను బహిర్గతం చేయకపోవడంలో హేతుబద్ధత ఏమిటి? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విషయాన్ని కోర్టుకు నివేదించింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనల్లో తమకు వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్‌ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఆర్‌డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ సోమవారం నాటి తన వాదనలను కొనసాగించారు.
 
2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది...

ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ద్వారా ఎంత మందికి ఉపాధి లభిస్తుందని సోమవారం నాడు ప్రశ్నించారని.. 1.25 లక్షల కుటుంబాల్లో 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కన్సార్టియం ప్రతిపాదనల్లోనే ఉందని శ్రీనివాస్ వివరించారు. ఈ స్టార్టప్ ఏరియా చుట్టపక్కల ప్రాంత అభివృద్ధికి ఓ ఉత్ప్రేరకంగా ఉంటుందని తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)లో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ సీసీడీఎంసీ ఈ స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలు తీసుకుంటుందని, ఇందుకు ప్రభుత్వ నిధులనే వెచ్చిస్తుందని చెప్పారు.

స్టార్టప్ ఏరియాలోని భూములను అభివృద్ధి చేయడం, మార్కెట్ చేయడానికి సంబంధించిన హక్కులనే ఎస్‌పీవీకి ఇస్తామే తప్ప, ఆ భూములపై యాజమాన్యపు హక్కులు సీఆర్‌డీఏకే ఉంటాయని, అంతిమంగా కొనుగోలుదారులకు సీఆర్‌డీఏనే రిజిష్టర్ చేస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి ఈ ఎస్‌పీవీ ఆదాయంలో వాటా ఇస్తుందని తెలిపారు. స్థూల అమ్మకాల ఆధారంగా ఆదాయ వాటా ఉంటుందని వివరించారు. ప్రభుత్వానికి ఇక్కడ లాభం కంటే, విదేశీ పెట్టుబడులు, ఉపాధి కల్పనే ముఖ్యమని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
 
లాభాలను ఆశించడం లేదు.. రియల్ ప్రాజెక్టు కాదు..
‘మీ ఉద్దేశాలను ఓసారి పక్కన పెట్టండి. పిటిషనర్లు కూడా మీ ఉద్దేశాలను ప్రశ్నించడం లేదు. మీరు చేపడుతున్నది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని వారు చెబుతున్నారు. పట్టణ మౌలిక సదుపాయాలు, రోడ్లు తదితరాలన్నీ ఏర్పాటు చేస్తున్నప్పుడు దానిని ఎందుకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా పిలవకూడదు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. పట్టణ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నంత మాత్రాన అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కాదని ఏజీ బదులిచ్చారు. ప్రభుత్వం లాభాన్ని ఆశించడం లేదని, విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలనే చూస్తోందని వివరించారు. సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారని... వాస్తవానికి ప్రభుత్వ విధానంలో ఎటువంటి లోపం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీఐడీఈ చట్టంలోని సెక్షన్-19 గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ఈ సమయంలో కోర్టు పనివేళలు ముగియడంతో విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.
 
బహిర్గతం చేస్తేనే కదా.. చాలెంజ్‌కు అవకాశం..
ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో సింగపూర్ కన్సార్టియం మూలధనమెంత? అంటూ ధర్మాసనం ప్రశ్నిం చింది. మూలధన పెట్టుబడులు ఒక్కసారిగా పెట్టరని, దశల వారీగా పెట్టుబడులు ఉంటాయని ఏజీ వివరిం చారు. ఈ మూలధన పెట్టుబడుల వివరాలన్నీ యాజ మాన్య సమాచారమన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంత రం చెబుతూ.. ‘వ్యాపార ప్రణాళికలను రహస్యంగా ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు. కాని మూలధనంతో పాటు మిగిలిన వివరాలను ఎందుకు దాచిపెడుతున్నట్లు? ఇలా ముఖ్యమైన వివరాలను యాజమాన్య సమాచారంటూ బహిర్గతం చేయకపోవడంలో హేతుబద్ధత ఏమిటి? మీరు ఆ వివరాలు ముఖ్యంగా ఆదాయ వివరాలను బహిర్గతం చేస్తేనే కదా.. కన్సార్టియం ప్రతిపాదనలను మిగిలిన వారు చాలెంజ్ చేయగలుగుతారు?’ అని ప్రశ్నించింది.

ఆదాయ వివరాలు బహిర్గతం చేయబోమని చెప్పడం లేదని, సాంకేతిక బిడ్‌లో అర్హత సాధించిన తరువాత సీల్డ్ కవర్‌లోని వివరాలను అందరికీ చెబుతామని ఏజీ చెప్పారు. కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం మొత్తం సంతృప్తికరంగా లేకపోతే ప్రతిపాదనలను రద్దు చేస్తామన్నారు. సింగిల్ జడ్జి ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని.. ఈ మొత్తం వ్యవహారంలో ఆదాయమన్నది చిన్న విషయమని, ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం తక్కువ అయినప్పటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని ఆయన తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement