Sakshi News home page

పూరీతో సంబంధాలపైనే ఫోకస్‌!

Published Wed, Jul 26 2017 2:38 AM

పూరీతో సంబంధాలపైనే ఫోకస్‌! - Sakshi

- ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను విచారించిన ఎక్సైజ్‌ సిట్‌
కెల్విన్‌తో సంబంధాలపై ఆరా
ముగ్గురు వ్యాపారవేత్తలను కూడా ప్రశ్నించిన సిట్‌
 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంలో మంగళవారం సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ధర్మారావు అలియాస్‌ చిన్నాను సిట్‌ విచారించింది. ఉదయం 10.30కి ప్రారంభమైన విచారణలో.. ప్రధానంగా చిన్నాకు, పూరీ జగన్నాథ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. పూరీతో కలసి డ్రగ్స్‌ తీసుకున్నారా అని ప్రశ్నించగా తనకు అలాంటి అలవాటేదీ లేదని చిన్నా చెప్పినట్టు తెలుస్తోంది. పూరీతో కలసి ఎక్కువ సినిమాలకు పనిచేయడం వల్ల తన పేరు తెరమీదకు వచ్చి ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈవెంట్‌ మేనేజర్‌గానే కెల్విన్‌తో పరిచయం ఏర్పడిందని.. దాంతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడానని చెప్పినట్లు తెలిసింది.

పూరీ జగన్నాథ్‌ ద్వారా చిన్నాకు డ్రగ్స్‌ అలవాటైనట్లుగా కెల్విన్‌ చెప్పాడని అధికారులు ప్రస్తావించగా.. అది అవాస్తవమని, కావాలంటే పరీక్షలు చేసుకోవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా సిట్‌ అధికారులు చిన్నాను 25కు పైగా ప్రశ్నలు వేశారని తెలిసింది. ఇక మధ్యాహ్నం 1.45 గంటల సమయంలోనే చిన్నా విచారణ ముగిసి బయటికి వచ్చారు. ఈ కేసులో ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖుల్లో చిన్నా విచారణే తక్కువ సమయంలో ముగియడం గమనార్హం.
 
నేడు చార్మి వంతు
పూరీ జగన్నాథ్‌తో కలసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న హీరోయిన్‌ చార్మి బుధవారం సిట్‌ విచారణకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ఎక్కడ కోరితే అక్కడ విచారించేందుకు సిద్ధమంటూ తామిచ్చిన అవకాశాన్ని చార్మి సద్వినియోగం చేసుకోలేదని.. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆమె సిట్‌ కార్యాలయంలోనే విచారణకు హాజరవుతారని వెల్లడించారు. పూరీ జగన్నాథ్‌తో కలసి ఆమె పలువురికి డ్రగ్స్‌ అలవాటు చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో చార్మిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశముందని సిట్‌ అధికారి ఒకరు తెలిపారు. చార్మి పదే పదే కెల్విన్‌తో వాట్సాప్‌ చాటింగ్, కాల్స్‌ చేశారని.. అతడితో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని.. వాటి ఆధారంగా విచారిస్తామని చెప్పారు. 
 
కెల్విన్‌ ఇంట్లో సోదాలు
డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్‌ నివాసంలో సిట్‌ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వాస్తవా నికి కెల్విన్‌ అరెస్టు సమయంలోనే అతడి నివాసంలో తనిఖీలు చేసేందుకు ప్రయత్నించామని అధికారులు తెలిపారు. కానీ కెల్విన్‌ కుటుంబ సభ్యులు ఎక్సైజ్‌ అధికారులపై దాడికి పాల్పడటంతో పూర్తిస్థాయిలో సోదా చేయలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకుని మంగళవారం తిరిగి సోదాలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కెల్విన్‌ వ్యక్తిగత కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ను, గతంలో వాడిన మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 
 
ఎవరా ముగ్గురు వ్యాపారవేత్తలు
ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను ప్రశ్నిస్తున్న సమయంలోనే సిట్‌ అధికారులు ముగ్గురు వ్యాపారవేత్తలను కూడా పిలిపించి విచారించారు. హైదరాబాద్‌కు చెందిన బానోత్‌ సౌరభ్, ఆకుల రిషితేష్, అంకిత్‌ అగర్వాల్‌లను విచారిస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. కానీ వారు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ తరహా వ్యాపారం చేస్తారు, వారికీ ఈ డ్రగ్‌ కేసుకు ఉన్న లింకులు ఏమిటన్న వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. దీనిపై సిట్‌ మీడియా లైజనింగ్‌ అధికారులను కోరినా... తమ వద్ద వారి పేర్లు తప్ప ఇతర వివరాలేవీ లేవని పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురిలో ఒకరు ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల సంస్థను నిర్వహిస్తున్నారని, ఆ ఉత్పత్తిని అడ్డుపెట్టుకొని డ్రగ్స్‌ విక్రయిస్తున్నారని సిట్‌ అనుమానిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement