ఉద్రిక్తం | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తం

Published Mon, Jan 19 2015 11:59 PM

ఉద్రిక్తం

సిటీబ్యూరో: ఇళ్ల కోసం నగరంలోని బస్తీ వాసుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తాము దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. కలెక్టరేట్‌కు జనం పోటెత్తుతున్నారు. ఇలా వచ్చిన వారితో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు సంయమనం పాటించడంతో చివరకు ప్రశాంతత నెలకొంది. నగరంలోని వివిధ బస్తీల నుంచి వందలాదిగా జనం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచే మహిళలు కలెక్టరేట్‌కు వస్తున్నారన్న విషయం గమనించిన జిల్లా గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది 7 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు.అప్పటికే లోపలికి ప్రవేశించిన 200 మంది మహిళలను బయటకుపంపించి రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోగా పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకున్నారు. గేట్లు మూసివేయడంతో ఆగ్రహించిన మహిళలు... ‘ఇళ్ల దరఖాస్తులు తీసుకోవడం లేద’ంటూ కలెక్టరేట్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు బ్యానర్లను చించేశారు. ఇదే విషయమై ముద్రించిన కరపత్రాలను సిబ్బంది పంచిపెట్టబోగా...వాటినీ చించేశారు. మహిళలు లోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా 50 మందికిపైగా మహిళలు గేటు దూకి లోపలికి చేరుకున్నారు. కలెక్టర్ వాహనం వద్ద బైఠాయించారు. దరఖాస్తులు తీసుకోవాలని పట్టుబట్టారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్లు ఇస్తామంటూ వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో ప్రకటిస్తుంటే... మీరు మాత్రం అడ్డుకుంటున్నార’ని శాపనార్ధాలు పెట్టారు. ఒక దశలో సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దుమ్ము పోసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగినా పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది సంయమనంతో వ్యవహరించారు. ఎట్టకేలకు వారిని శాంతింపజేసి, మధ్యాహ్నానికి అక్కడి నుంచి పంపించేశారు.

దండుకుంటున్న దళారులు

ఇళ్ల విషయమై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నగరంలోని వివిధ బస్తీల్లో ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించిన దళారులు నాలుగు రాళ్లు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఇళ్లు ఇప్పిస్తామంటూ భారీ మొత్తాలకు బేరాలు పెడుతుంటే... మరికొంతమంది చిన్న చిన్న పనుల పేరుతో దండుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరు బస్తీలకు ఫోటోగ్రాఫర్లను రప్పించి రూ.50 వంతున వసూలు చేస్తూ రెండేసి ఫోటోలు ఇప్పిస్తున్నారు. ఒక్కో దరఖాస్తును రూ.20కు విక్రయిస్తున్నారని... దానిని పూర్తి చేయడానికి రూ.10 నుంచి రూ.15 వంతున తీసుకుంటున్నారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. అధికారులు దరఖాస్తులు తీసుకోకపోవడంతోవాహన చార్జీలు సహా రూ.100 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నామని ఒక మహిళ కలెక్టరేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దీన్నిబట్టి దళారుల హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వెనుక నుంచి వచ్చిన సిబ్బంది

ఇళ్ల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు వందలాది మంది మహిళలు రావడంతో కలెక్టరేట్‌లో విధులకు హాజరు కావలసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పక్కనున్న సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న దారి గుండా లోపలికి చేరుకున్నారు. కలెక్టర్ నిర్మల, ఇన్‌చార్జి జేసీ, డీఆర్‌ఓతో పాటు జిల్లా అధికారులు , ఉద్యోగులు, సిబ్బంది అంతా వెనుక దారి నుంచే   కార్యాలయానికి చేరుకున్నారు.

 దళారులను నమ్మెద్దు.. ఇళ్ల దరఖాస్తులతో రావద్దు: కలెక్టర్ నిర్మల

ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ కె.నిర్మల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ప్రజలకు వాటిపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అప్పటి వరకు కార్యాలయాల వద్దకు రావద్దని కోరారు.
 
 

Advertisement
Advertisement