సాగు 85 శాతం.. రుణాలు 45 శాతమే! | Sakshi
Sakshi News home page

సాగు 85 శాతం.. రుణాలు 45 శాతమే!

Published Thu, Feb 8 2018 2:55 AM

Failure of banks in Rabi crop loan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీగా పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం రుణాలు అందడం లేదు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకా రం రబీ పంటల సాగు విస్తీర్ణం 85 శాతానికి చేరింది. కానీ రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు లక్ష్యంలో 45.66 శాతమే కావ డం గమనార్హం. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు.. నవంబర్‌కే రైతులకు రుణాలు అందాలి.

కానీ సాగు చివరి దశకు చేరుకుంటున్నా బ్యాంకులు స్పందించట్లేదు. బ్యాంకర్లపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలమవుతుండటంతో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొం  ది. గత ఖరీఫ్‌లో చేతికొచ్చిన  పంటలకు తగిన ధర రాక రైతులకు నిరాశే మిగిలింది. బ్యాంకులు కూడా మొండి చెయ్యి చూపిస్తుం  డటంతో రైతులు దిగులు పడుతున్నారు.

లక్ష్యంలో సగం కూడా ఇవ్వలేదు..
రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31,92 లక్షల ఎకరాలు కాగా...  27.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలుకాగా.. 15 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో తెలిపింది. అంటే దాదాపుగా పంటల సాగు చివరి దశకు వచ్చిన పరిస్థితుల్లో బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. రబీ పంట రుణాల లక్ష్యం రూ.15,901 కోట్లు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.7,261 కోట్లేనని వెల్లడైంది. లక్ష్యంలో సగం కూడా రుణాలు ఇవ్వలేదని స్పష్టమవుతోంది.

రైతుల పైనే వడ్డీ భారం
రైతుల రుణాలకు సంబంధించి పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాల కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.321 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీని చెల్లింపులో సర్కారు చేస్తు న్న జాప్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌లు జారీ చేసి నిధులు మాత్రం విడుదల చేయకపోతుండటంతో.. బ్యాంకులు వడ్డీల సొమ్మును రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. రైతుల నుంచి తీసుకోవద్దని, వడ్డీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపినా.. నిధులు విడుదల చేయలేదు.

రుణమాఫీ నిధులను కూడా ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేయడంతో, బ్యాంకులు ఆ రుణాలపై వడ్డీని వసూలు చేశాయి. రూ.లక్షలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయకూడదు. ప్రభుత్వమే దానిని రీయింబర్స్‌ చేస్తుంది. బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో బుక్‌ అడ్జస్ట్‌మెంట్లు చేస్తున్నాయి. కొత్త అప్పు మంజూరు చేస్తూనే.. పాత అప్పును, వడ్డీని రికవరీ చేస్తాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, బ్యాం కులు రుణాలివ్వకుండా ఇబ్బందిపెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement