ఏడాది చివరికల్లా రైతు సమాఖ్యలు | Sakshi
Sakshi News home page

ఏడాది చివరికల్లా రైతు సమాఖ్యలు

Published Sun, Jul 16 2017 2:08 AM

ఏడాది చివరికల్లా రైతు సమాఖ్యలు - Sakshi

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సంఘాలపై సన్నాహాలు
- ఈ సంఘాల ద్వారానే ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి పథకం
మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ
-  ఆదర్శ రైతులతో సీఎం మూడు విడతల భేటీ
 
సాక్షి, హైదరాబాద్‌: రైతు సమాఖ్యలను ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటు చేయనున్న సమాఖ్యలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతుకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి ప్రోత్సాహకం ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం ఈ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రైతు సమగ్ర సర్వే పూర్తి చేసి, వాటి వివరాలను విశ్లేషిస్తోంది. సన్నచిన్నకారు, మధ్య తరగతి, ధనిక రైతుల వివరాలను ఈ సర్వే ద్వారా గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా ఆర్థికంగా ఎంతెంత కేటాయించాల్సి ఉంటుందో కచ్చితమైన నిర్ణయానికి వస్తారు. అలాగే జిల్లాకు 100 మంది చొప్పున ఆదర్శ రైతులను సర్కారు గుర్తించింది.

అలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులతో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం ఏర్పాటు చేస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. అయితే 3 వేల మందితో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా ఆయన సమావేశమవుతారు. 3 వేల మందితో ఒకేసారి ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించడానికి వీలుకాదని, అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ‘సాక్షి’కి తెలిపారు. భేటీల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
 
ఎన్నికలు లేకుండానే సమాఖ్యలు
వచ్చే ఏడాది మే 15వ తేదీ నాటికి రైతులకు ప్రోత్సాహకం అందజేయాలంటే.. గ్రామ,  జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమాఖ్యలను త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమాఖ్యలను ఈ ఏడాది చివరి నాటికల్లా ఏర్పాటు చేస్తామని పోచారం తెలిపారు. వాటికి తోడుగా సమన్వయ కమిటీలు కూడా ఉంటాయని అంటున్నారు. దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే రైతు సమాఖ్యలకు ఎలాంటి ఎన్నికలూ ఉండబోవని పోచారం స్పష్టంచేశారు. సంఘాల ఏర్పాటుతోపాటు వాటి అధ్యక్షులను కూడా ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. మరోవైపు వాటిని రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశమూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలన్నీ రైతు సంఘాల ద్వారానే జరుగుతాయి. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే సమాఖ్యల వల్ల వ్యవసాయ యంత్రాంగంపై అధ్యక్షుల పెత్తనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనే వాదనలున్నాయి. ‘సీఎం అంత పవర్‌ఫుల్‌గా రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉండాలి’  అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే కిందిస్థాయి నుంచి కూడా వీరు చాలా కీలకంగా ఉంటారు. దీనివల్ల తమపై రైతు సంఘాల అధ్యక్షులు పెత్తనం చెలాయిస్తారనే ఆందోళన వ్యవసాయ ఉద్యోగుల్లో నెలకొంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement