'రైతులు కష్టపడితే కోటీశ్వరులవుతారు' | Sakshi
Sakshi News home page

'రైతులు కష్టపడితే కోటీశ్వరులవుతారు'

Published Tue, Dec 22 2015 9:01 PM

Farmers will become richmen, if they would do hard, says Pocharam srinivasa rao

రైతు ఆత్మహత్యలు జరగాలని కోరుకోవడం లేదు
ఎవరికీ కూర్చోపెట్టి తిండిపెట్టం.. తోవ చూపిస్తాం
రైతుల ఉసురు పోసుకోవద్దు.. భుజం తట్టండి
అనుమతుల్లో జాప్యం చేసే అధికారులకు జరిమానా
డ్రిప్ ఇరిగేషన్‌కు నాబార్డు నుంచి రూ.వేయి కోట్లు
పాలీహౌజ్ కంపెనీల మేళాలో మంత్రి పోచారం


సాక్షి, హైదరాబాద్: ‘రైతుల ఆత్మహత్యలు జరగాలని ఎవరూ కోరుకోవడం లేదు. కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. కష్టపడితేనే రైతులు కోటీశ్వరులవుతారు. ప్రభుత్వం ఎవరికీ కూర్చోపెట్టి తిండిపెట్టదు. రాయితీలు ఇచ్చి తోవ చూపిస్తుందని’ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ పాత పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ‘పాలీహౌజ్ సాగు చేపట్టే రైతులు, పాలీహౌజ్‌లు నిర్మించే కంపెనీల పరిచయ వేదిక’లో మంత్రి పోచారం పాల్గొన్నారు. పాలీహౌజ్ నిర్మాణ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ‘రైతు ఆత్మహత్యలు జరుగుతున్న మాట వాస్తవమే. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 24లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో లోపాల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏటా పెట్టుబడి కోసం అప్పులు చేస్తుండటంతో రైతులకు ఏమీ మిగలడం లేదు. అధికారులు వారి భుజం తట్టి ప్రోత్సహించాలి. రైతులు సాగు మానేస్తే దేశం తలకిందులవుతుంది. రాయితీలు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులకు తక్షణమే పరిష్కారం చూపాలి. లేదంటే పరిశ్రమల శాఖ తరహాలో సకాలంలో సమస్యలు పరిష్కరించని అధికారులకు జరిమానా విధించాల్సి వుంటుందని’ మంత్రి పోచారం హెచ్చరించారు.

నాబార్డు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు
‘ఈ ఏడాది 55వేల హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 1.25లక్షల ఎకరాల మేర దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే భరించాం. అందరికీ రాయితీ అందించేందుకు నాబార్డు నుంచి రూ.వేయి కోట్లు సాయం కోరామని’ మంత్రి పోచారం వెల్లడించారు. పాలీహౌజ్ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు నిబంధనలను సడలించామని.. గతంలో గరిష్టంగా ఎకరం విస్తీర్ణంలో అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం మూడు ఎకరాలకు పెంచామన్నారు. పాలీహౌజ్‌లపై గతంలో వున్న సబ్సిడీని 50 శాతం నుంచి 75శాతంకు పెంచామన్నారు. పాలీహౌజ్‌లపై మహారాష్ట్రలో 30శాతం, గుజరాత్‌లో 50శాతం మేర మాత్రమే రాయితీ లభిస్తున్నదన్నారు. ఈ ఏడాది వేయి ఎకరాల్లో పాలీహౌజ్‌ల నిర్మాణం లక్ష్యంగా.. రాయితీల కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కే టాయించి, ఇప్పటి వరకు రూ.125 కోట్లు ఖర్చు చేశామన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలను డ్రిప్, పాలీహౌజ్ సాగు పరిధిలోకి తీసుకు రావడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా వున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పోచారం వెల్లడించారు. ద్రవ ఎరువులు, పాలీహౌజ్‌లకు విద్యుత్ రాయితీ తదితరాలపై సీఎం సానుకూలంగా స్పందించారని.. రైతుల వినతిని మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రతాప్, శాస్త్రవేత్త చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాలీహౌజ్ విధానంలో సాగు చేస్తున్న రైతులు తమ విజయగాథలు, సమస్యలను మంత్రి ఎదుట ప్రస్తావించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement