అసెంబ్లీలో ‘బెల్లు’ లొల్లి! | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ‘బెల్లు’ లొల్లి!

Published Thu, Jan 5 2017 3:59 AM

అసెంబ్లీలో ‘బెల్లు’ లొల్లి! - Sakshi

ప్రసంగం ముగించాలంటూ బెల్‌ కొట్టిన డిప్యూటీ స్పీకర్‌
‘అయితే ఇప్పుడే కూర్చుంటా..’ అన్న కోమటిరెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: ఫీజుల పథకంపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి బెల్‌ కొట్టడంతో ఐదు నిమిషాల పాటు సభలో గందరగోళం నెలకొంది. మంత్రి ప్రకటన తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి కొంతసేపు మాట్లాడారు. తర్వాత త్వరగా ముగించాలంటూ డిప్యూటీ స్పీకర్‌ బెల్‌ కొట్టారు. దీంతో ‘బెల్‌ కొడితే ఇప్పుడే కూర్చుంటా..’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌ ‘అది మీ ఇష్టం..’ అంటూ కోమటిరెడ్డి మైక్‌ కట్‌ చేశారు. ఆయన ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా మైక్‌ ఇవ్వకపోవడంతో ఆవేశంతో తన చేతిలో ఉన్న కాగితాలను చించి విసిరివేశారు.

ఈ సమయంలో మంత్రి హరీశ్‌ జోక్యం చేసుకున్నారు. సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తిపై సీనియర్‌ సభ్యుడు కాగితాలు చించి విసిరేసి అగౌరవపర్చడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, వెంటనే సభ్యుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తర్వాత డిప్యూటీ స్పీకర్‌ మాట్లాడుతూ... ‘త్వరగా ముగించాలని బెల్‌ కొట్టడం ఛైర్‌ హక్కు. ఛైర్‌ను ప్రశ్నిస్తారా? మీరు కొట్టమన్నప్పుడు బెల్‌ కొట్టాలా?’ అని అన్నారు. ఈ సమయంలో సీఎల్పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని బెల్‌ కొట్టడంలో అభ్యంతరం లేదని, కానీ తనను కూర్చోమని అంటున్నారని కోమటిరెడ్డి అనుకున్నారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

తమ తరఫున మరో సభ్యుడు మాట్లాడాల్సి ఉందని, ఆయన సమయాన్ని తగ్గించయినా కోమటిరెడ్డికి మరో ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని సూచించారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ తొలుత నిరాకరించినా.. తర్వాత కోమటిరెడ్డికి అవకాశమిచ్చారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తాను స్పీకర్‌ను అగౌరవపర్చలేదని, అయినా స్పీకర్‌ అలా భావిస్తే క్షమాపణ చెపుతున్నానన్నారు. మహిళలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంటే ఇద్దరు మహిళలకు కేబినెట్‌లో అవకాశమివ్వాలని వ్యాఖ్యానించారు. ఫీజుల పథకంపై ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్‌ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement