ఆశావహుల్లో సినీ ప్రముఖులు | Sakshi
Sakshi News home page

ఆశావహుల్లో సినీ ప్రముఖులు

Published Wed, Apr 6 2016 1:04 AM

ఆశావహుల్లో సినీ ప్రముఖులు - Sakshi

♦ టీడీపీ సీటు ద్వారా రాజ్యసభలో ప్రవేశానికి జోరుగా యత్నాలు
♦ పరిశీలనలో దగ్గుబాటి సురేష్, కేఎల్ నారాయణ పేర్లు
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తున్నవారి జాబితాలో ప్రముఖ సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, డాక్టర్ కేఎల్ నారాయణ కూడా చేరారు. తమ ఆసక్తిని వీరు ఇటీవల టీడీపీ పెద్దలకు తెలియజేశారని, పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభకు ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్నాయి. టీడీపీకి మూడు సీట్లు దక్కనుండగా.. అందులో ఒకటి తమకు కేటాయించాలని మిత్రపక్షమైన బీజేపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సురేష్ టీడీపీ మాజీ ఎంపీ, సినీ నిర్మాత, దర్శకుడైన దివంగత దగ్గుబాటి రామానాయుడు కుమారుడు.

దగ్గుబాటి కుటుంబం తొలినుంచీ టీడీపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతోంది. సురేష్‌ను రాజ్యసభకు పంపితే సినీ రంగం నుంచి పార్టీకి పూర్తి మద్దతు ఉంటుందనే అభిప్రాయాన్ని టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సినీ రంగంతో సన్నిహిత సంబంధాలున్న ఓ ఎమ్మెల్యేతో పాటు ఓ మంత్రి కూడా సురేష్ పేరును చంద్రబాబు వద్ద ఇప్పటికే ప్రస్తావించారనే ప్రచారం జరుగుతోంది. ఇక నారాయణ కూడా టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

తనను రాజ్యసభకు పంపితే పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని నారాయణ చెప్పినట్లు తెలిసింది. మిగతావారి విషయానికొస్తే.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు అన్నివిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కంభంపాటికి ఎన్‌డీఏలో కీలకపాత్ర పోషించే బీజేపీతో పాటు మిగిలిన పార్టీల్లోని పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయన ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల నేతల నుంచి కూడా చంద్రబాబుకు ఫోన్లు చేయిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరి ఆ వెంటనే ఎమ్మెల్సీ సీటును తన తప్పిదం వల్ల చేజార్చుకుని ఓ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమితుడైన నేత పేరును ఓ కాంగ్రెస్ ఎంపీ సిఫారసు చేశారని ప్రచారం జరుగుతోంది.  

 ‘ఎమ్మెల్యేలను కొనండి .. టిక్కెట్టు తీసుకోండి’
 ‘ఎమ్మెల్యేను కొనండి -టిక్కెట్టు తీసుకోండి’ అనే ఆఫర్‌ను ఓ కేంద్ర మంత్రికి టీడీపీ అధిష్టానం ఇచ్చిందని సమాచారం. ఈ మంత్రి రాజ్యసభ అభ్యర్థిత్వం ఈ ఏడాది జూన్‌లో ముగియనుంది. విదేశీ బ్యాంకులను ముంచిన కేసులో ఇరుక్కున్న ఈ మంత్రికి చంద్రబాబు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల 8 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారికి భారీ ఎత్తున నగదు ముట్ట చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బును ఈ మంత్రే సమకూర్చారని టీడీపీ వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్లను అదేవిధంగా కొనసాగిస్తే టిక్కెట్టు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రికి బాబు హామీ ఇచ్చినట్లు చెబుతున్నాయి.
 
 ప్రధాని అడిగితే ఇద్దాం..
  ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి అడిగితే బీజేపీకి సీటు ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని సమాచారం. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆశించినంత సాయం రాలేదు. మిత్రపక్షమైన టీడీపీ నేతలకు గవర్నర్‌తో పాటు పలు పదవులు ఇస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాంటప్పుడు వారు అడగకముందే రాజ్యసభ సీటు ఇవ్వడంకంటే అడిగించుకుని, నిధులు, పదవుల హామీలు ఏమయ్యానని ప్రధాని వద్ద ప్రస్తావించి సీటు కేటాయించాలనే యోచనలో బాబు ఉన్నట్టు టీడీపీవర్గాల సమాచారం. అదే సమయంలో బీజేపీ ఎవరి మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, టీడీపీకే వారితో అవసరం కాబట్టి ప్రధాని అడిగినా, అడగకపోయినా ఒక సీటు కేటాయించటం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

Advertisement
Advertisement