‘చింతామణి’ కేసులో ఐదుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

‘చింతామణి’ కేసులో ఐదుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్

Published Wed, Jul 1 2015 4:44 PM

‘చింతామణి’ కేసులో ఐదుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్ - Sakshi

చింతామణి ఔషధ రాయి చోరీ కేసులో ఐదుగురు స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం గోపాలపురానికి చెందిన రామకృష్ణ జీడిపప్పు వ్యాపారి. ఆయనకు ఇటీవల వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. అయితే, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడు సిద్ధప్ప ఏడో తరానికి చెందిన ఔషధ రాయి రామకృష్ణ తాతల కాలం నుంచి వాళ్ల కుటుంబం వద్ద ఉంది. ఈ ఔషధ రాయి, పాలు కలిపి ఆయన వివిధ రకాల రోగాలను నయం చేస్తున్నారు. ఆ రాయిని రూ.25 లక్షలకు విక్రయించేందుకు  దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి రామిరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

కరీం ఎలియాస్ రషీద్ చింతామణి ఔషధ రాయిని రూ.25 లక్షలకు కొనేందుకు రామిరెడ్డితో మాట్లాడి ఓయూ క్యాంపస్ వద్దకు రావాలని చెప్పాడు. చింతామణి రాయితో ఓయూకు వచ్చిన రామిరెడ్డి పై దాడిచేసి అతని వద్ద గల రూ.14 వేలను, రెండు సెల్‌ఫోన్లు,  ఔషధ రాయిని తీసుకొని పారిపోయారు. రామిరెడ్డి సెల్‌లో గల  వివరాలను చూసి రామకృష్ణకు ఫోన్‌చేసి చింతామణి ఔషధ రాయి ఉంది కొంటారా అని మాట్లాడారు. అయితే ఆ రాయి తనదేనని దాన్ని మీరు రామిరెడ్డి నుంచి బలవంతంగా తీసుకెళ్లారని రామకృష్ణ కేసు పెట్టారు. కేసు నమోదు చేసి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్పెషల్ పోలీసు సిబ్బంది బాలునాయక్, రాజ్‌గోపాల్, శ్రీనునాయక్, రాజుతో పాటు ఏపీఎస్పీ పోలీసు ఉద్యోగం నుంచి తొలగించిన వెంకటరాజ్యాన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీం పరారీలో ఉన్నాడని,  రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement