టిప్పు తుపాకీ దొరికింది | Sakshi
Sakshi News home page

టిప్పు తుపాకీ దొరికింది

Published Tue, Sep 13 2016 2:46 AM

టిప్పు తుపాకీ దొరికింది

-  ‘సాక్షి’ కథనంతో స్టోర్‌లో గాలించి గుర్తించిన అధికారులు

- దుమ్ముకొట్టుకుపోయి వెలిసిపోయిన తుపాకీ

- కొన్ని భాగాల్లో తుప్పు పట్టి అధ్వాన స్థితిలో ఉన్న వైనం

- తుపాకీ చివరన కనిపించని పులి బొమ్మ

- పురావస్తు శాఖ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్
 

సాక్షి, హైదరాబాద్: దాదాపు 15 ఏళ్లుగా ‘కనిపించ’కుండా పోయిన టిప్పు సుల్తాన్ తుపాకీ దొరికింది! ‘టిప్పు తుపాకీ మాయం’ పేరిట ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో స్పందించిన అధికారులు... పురావస్తు శాఖ స్టోర్‌లో వెతికి ఆ తుపాకీని గుర్తించారు. కానీ అమూల్య చారిత్రక సంపద అయిన ఆ తుపాకీ దుమ్ముకొట్టుకుపోయి, తుప్పుపట్టి అధ్వాన స్థితిలో ఉంది. ఇక టిప్పు సుల్తాన్ తుపాకీ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో.. వెంటనే దానిని ప్రదర్శనకు పెట్టేందుకు వైఎస్సార్ స్టేట్ మ్యూజియం సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
 

 ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు..

 అప్పట్లో ప్రదర్శన శాల నుంచి ఈ తుపాకీని తొలగించిన సిబ్బంది దానిని స్టోర్‌లో పడేశారు. తర్వాత అప్పటి అధికారులు, సిబ్బంది పదవీ విరమణ చేయడంతో అంతా దాన్ని మర్చిపోయారు. ఈ అంశాన్ని ‘టిప్పు తుపాకీ మాయం’ పేరిట మూడు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు స్టోర్‌లో గాలించి టిప్పు తుపాకీని గుర్తించారు. దానిని ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టేట్ మ్యూజియంలో ఓ గ్యాలరీ ఏర్పాటు చేసి ఈ తుపాకీతోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న మరికొన్ని తుపాకులు, ఖడ్గాలు, డాగర్లు, ఇతర యుద్ధ సంబంధ వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నారు.
 

 అధికారుల తీరుపై సందేహాలు

 మ్యూజియంలో ప్రదర్శనకు ఎన్నో పురాతన వస్తువులున్నా.. సందర్శకులు ప్రత్యేకంగా దృష్టి సారించే వాటిలో టిప్పు సుల్తాన్ తుపాకీ ఒకటి. కానీ వేరే వస్తువులను ఏర్పాటు చేసేందుకంటూ అప్పట్లో టిప్పు తుపాకీని తొలగించారు. మరోచోటనైనా ప్రదర్శించకుండా స్టోర్‌లో పడేశారు. తర్వాత కూడా ఎవరూ దాని ఊసెత్తకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యేవరకు ఆ శాఖ మంత్రి కార్యాలయానికి కూడా టిప్పు తుపాకీ గురించిన సమాచారం లేదు. శాఖ ఉన్నతాధికారులకు కూడా మ్యూజియంలో టిప్పు తుపాకీ  ఉన్న సంగతి తెలియక పోవడం గమనార్హం.


దుమ్ముకొట్టుకుపోయి..

దాదాపు 15 ఏళ్లుగా ‘అదృశ్యం’గా ఉన్న టిప్పు సుల్తాన్ తుపాకీని పురావస్తు శాఖ స్టోర్‌లో దుమ్ము కొట్టుకుపోయిన స్థితిలో గుర్తించారు. దాన్ని భద్రపర్చిన పెట్టెలోంచి బయటకు తీసి శుభ్రపరిచారు. కానీ ఆ తుపాకీ మునుపటి మెరుపును కోల్పోయి ఉంది. కొన్ని చోట్ల తుప్పు పట్టింది కూడా. కనీసం ఈ తుపాకీకి సంబంధించిన చిత్రాలు కూడా లేకపోవడంతో... ఇప్పుడు ఫొటోలు తీసి భద్రపరిచే పని చేస్తున్నారు. అసలు టిప్పు సుల్తాన్ వద్ద అప్పట్లో ఐదు తుపాకులుండేవని చెబుతారు. వాటిని ఆయన వివిధ నమూనాల్లో పులి బొమ్మలు ఉండేలా చేయించారు. పురావస్తు శాఖ వద్ద ఉన్న తుపాకీ చివర (వెనుకవైపు కలపతో చేసిన భాగంపై) కూడా పులి బొమ్మ ఉండేది. కానీ అది దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది.

 

 త్వరలో నిర్ణయిస్తాం..

 ‘‘టిప్పు సుల్తాన్ తుపాకీ లాంటి చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను ప్రజల సందర్శనకు వీలుగా ప్రదర్శనకు ఉంచుతాం. ఆ తుపాకీని ప్రదర్శన నుంచి తొలగించి స్టోర్‌లో పెట్టిన విషయం నేపథ్యం నాకు తెలియదు. త్వరలోనే దాని ప్రదర్శనపై నిర్ణయం తీసుకుంటాం..’’ - పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి

Advertisement

తప్పక చదవండి

Advertisement