రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు

Published Mon, Aug 14 2017 4:01 AM

రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు

నేడు, రేపు మోస్తరు.. తర్వాత రెండ్రోజులు భారీ వర్షాలు
ఇప్పటివరకు 16 శాతం లోటు వర్షపాతం

సాక్షి, హైదరాబాద్‌: కోస్తాంధ్రలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఈ నెల 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురు స్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో 50 శాతం భూభాగంలో వర్షాలు కురుస్తాయని ఆ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ఆదివారం తెలిపారు. గత 24 గంటల్లో హైదరాబాద్‌లోని గో ల్కొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోథ్, నాగరెడ్డిపేటల్లో 3 సెంటీమీటర్లు, సరూర్‌నగర్, సంగారెడ్డి, ఉట్నూరులలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఈ వానలతో వర్షాధార పంటలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. పత్తి, సోయా, మొక్కజొన్న, కంది తదితర పంటలకు ప్రాణం పోసినట్లయింది. అయితే చెరువులు, కుంటలు, జలాశయాలపై ఆధారపడిన చోట్ల అవి ఇంకా నిండకపోవడంతో వరి నాట్లు పూర్తిస్థాయిలో పడలేదు. దీంతో చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు.

ఆగస్టులో 36 శాతం లోటు వర్షపాతం...
రాష్ట్రంలో మోస్తరుగా వర్షాలు కురుస్తున్నా సాధారణంతో పోలిస్తే ఇప్పటికీ లోటు వర్షపాతమే రికార్డయింది. కాగా జూన్‌ నుంచి ఇప్పటివరకు 16 శాతం లోటు నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదవ్వగా, జూలైలో ఏకంగా 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 13 వరకు సాధారణం కంటే 36 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. జూన్‌లో సాధారణంగా 128.3 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 188.8 మి.మీ.లు నమోదైంది. జూలైలో 242.7 మి.మీ.లు కురవాల్సి ఉండగా, కేవలం 146.2 మి.మీ. వర్షమే కురిసింది. ఇక ఈ నెల 13 రోజుల్లో 91.6 మి.మీ. కురవాల్సి ఉండగా, కేవలం 58.3 మి.మీ. కురిసింది. రాష్ట్రంలోని మొత్తం 584 మండలాల్లో 259 మండలాల్లో సాధారణ వర్ష పాతం, 236 మండలాల్లో లోటు వర్షపాతం నమో దైంది. రెండు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెల కొన్నాయి. దీంతో ప్రస్తుత వర్షాలు వర్షాభావ పంటలకే ప్రయోజనం కలిగిస్తున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండే పరిస్థితి లేకుండా పోయింది.

ఆ 2 జిల్లాలు మినహాయిస్తే..
పాత జిల్లాల ప్రకారం జూన్‌ 1 నుంచి ఈ నెల 13 వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే కురవాల్సిన దానికన్నా అధిక వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని  జిల్లాల్లో కురవాల్సిన దాని కన్నా.. తక్కువ వర్షపాతమే నమోదైంది.

జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు పాత జిల్లాల ప్రకారం కురిసిన వర్షం (మి.మీ.లలో)
    జిల్లా    కురవాల్సింది              కురిసింది     తేడా     (శాతం)
    ఆదిలాబాద్‌                           626.3     420.7       –33
    హైదరాబాద్‌                          370.4     409.6        +11
    కరీంనగర్‌                            512.4     390.6         –24
    ఖమ్మం                              555.0     588.1           +6
    మహబూబ్‌నగర్‌                  316.6       264.5        –16
    మెదక్‌                              459.5       388.8         –15
    నల్లగొండ                          318.2       287.6         –10
    నిజామాబాద్‌                     579.9       403.7         –30
    రంగారెడ్డి                          369.8       326.9         –12
    వరంగల్‌                         522.2        486.1             –7
    మొత్తం                           470.6        396.7            –16

Advertisement
Advertisement