రేపట్నుంచి ‘గ్రేటర్’లో కేటీఆర్ రోడ్ షోలు | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి ‘గ్రేటర్’లో కేటీఆర్ రోడ్ షోలు

Published Fri, Jan 22 2016 4:10 AM

రేపట్నుంచి ‘గ్రేటర్’లో కేటీఆర్ రోడ్ షోలు - Sakshi

ఈ నెల 28 వరకు వందకుపైగా డివిజన్లలో ప్రచారం
ఒకటి లేదా రెండు భారీ సభలకు సీఎం
విలేకరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి


సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు ఈ నెల 23 (శనివారం) నుంచి 28 వరకు వందకుపైగా డివిజన్లలో రోడ్‌షోల ద్వారా ప్రచారం చేపడతారని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలతో కలసి గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ రోడ్‌షోలలో కనీసం 5 వేల నుంచి 10 వేల మంది వరకు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

కేటీఆర్ సవాల్‌కు అనుగుణంగా వందకుపైగా డివిజన్లలో విజయం సాధించి గ్రేటర్ పీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని..ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కేసీఆర్‌కే సాధ్యమవుతుందన్నారు. నీటి కొరత, విద్యుత్ కోతల వంటి సమస్యలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని మహేందర్‌రెడ్డి చెప్పారు.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలను గాలికి వదిలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని... బీజేపీ తన విధానాలను వీడి లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా టీఆర్‌ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మహేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు.

ఇతర ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్‌లో స్థానికులుగానే చూస్తామన్న సీఎం ప్రకటన వారిలో భరోసా నింపిందని.. ఆయా వర్గాల మద్దతు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంపై కేటీఆర్ విసిరిన సవాలుకు విపక్షాలు జవాబు చెప్పడం లేదని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నారు.

23, 24 తేదీల్లో కేటీఆర్ రోడ్ షో షెడ్యూలు
మంత్రి కేటీఆర్ శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గం (గచ్చిబౌలి)లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షోకు శ్రీకారం చుడతారు. కొండాపూర్, మియాపూర్, హైదర్‌నగర్ అమరావతి దేవాలయం నుంచి ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, జగద్గిరిగుట్ట బస్టాప్ చౌరస్తా, గాజుల రామారం, ఆర్‌ఆర్ నగర్‌లలో ప్రచారం నిర్వహిస్తారు.

24వ తేదీన అయ్యప్ప సొసైటీ వద్ద ప్రచారం ప్రారంభించి వివేకానంద నగర్ చౌరస్తా, అల్లాపూర్, మూసాపేట, ఫతేనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీ నగర్, వేంకటేశ్వరస్వామి దేవాలయం పరిసరాలు, కూకట్‌పల్లి, హస్మత్‌పేట, అంబేడ్కర్ చౌరస్తా, బాలానగర్, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, ఐడీపీఎల్ కాలనీ చౌరస్తాలలో ప్రచారం నిర్వహిస్తారు.

Advertisement
Advertisement