ఎండల్లో హాయ్‌ హాయ్‌..!! | Sakshi
Sakshi News home page

ఎండల్లో హాయ్‌ హాయ్‌..!!

Published Tue, May 2 2017 12:16 AM

ఎండల్లో హాయ్‌ హాయ్‌..!!

వేసవిలో ఏసీ బస్సులకు డిమాండ్‌
నగరంలో 10 శాతం పెరిగిన  ఆక్యుపెన్సీ


సిటీబ్యూరో: కూల్‌ జర్నీ.. వేసవి తాపం నుంచి  ఊరట. ఒకవైపు నిప్పులు చెరుగుతున్న ఎండలు, మరోవైపు వేడిగాలులు, ఉక్కపోత. అయినా  సిటీలో  తప్పని  ప్రయాణం. దీంతో  నగరవాసులు సాధారణ బస్సుల కంటే  ఏసీ బస్సుల వైపే  ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌  వంటి  బస్సుల  కోసం ఎదురు చూడకుండా  ఏసీ  బస్సు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్దగా ఆదరణ లేకుండా  తిరిగిన  ఏసీ  బస్సులు కొంతకాలంగా పరుగులు  పెడుతున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలు ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. సాధారణ, మెట్రో  బస్సుల  కంటే  ఏసీ  బస్సుల్లో చార్జీలు  కొద్దిగా  ఎక్కువే అయినా   ఎండల నుంచి ఉపశమనం కోసం  నగరవాసులు ఏసీ బస్సులనే  ఆశ్రయిస్తున్నారు. క్రమంగా ప్రయాణికుల ఆదరణ  పెరగడంతో  ఆక్యుపెన్సీ రేషియో  కూడా ఒక్కసారిగా  10 శాతానికి  పెరిగింది. అసలే ఆర్థికంగా దివాలా తీసి పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న  గ్రేటర్‌ ఆర్టీసీకి  ఇది  కొంతమేరకు శుభపరిణామం.

వివిధ  రూట్‌లలో ఏసీ  సర్వీసులు
గ్రేటర్‌ ఆర్టీసీలో ప్రస్తుతం 80 మెట్రో  లగ్జరీ  బస్సులు. ఇవి  హైటెక్‌సిటీ, మాధాపూర్, తదితర ప్రాంతాలతో పాటు  అన్ని వైపుల నుంచి  ప్రయాణికులకు  ఐటీ కారిడార్‌లకు రాకపోకలు  సాగించే విధంగా తిరుగుతున్నాయి. ఇవి కాకుండా   మరో  20 పుష్పక్‌ ఏసీ  బస్సులు నగరం నుంచి  మూడు మార్గాల్లో    ప్రత్యేకంగా   శంషాబాద్‌  అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో చార్జీలు కొద్దిగా ఎక్కువ కావడంతో ప్రయాణికులు వెనుకడుగు వేశారు. ఇతర బస్సుల  కంటే  వీటి నిర్వహణ ఖర్చు  భారీగా  ఉండడంతో వరుస నష్టాలే  ఎదురయ్యాయి.

గత నాలుగేళ్లలో  ఒక్క ఏసీ  బస్సులపైనే  సిటీ ఆర్టీసీ  రూ.117.36 కోట్ల  నష్టాలకు గురైనట్లు అంచనా. మొత్తం నష్టం  రూ.289 కోట్ల వరకు  ఉంటే  అందులో ఏసీ బస్సుల నష్టాలే  సగం  మేరకు ఉన్నాయి. గత  రెండు నెలలుగా  ఏసీ  బస్సులకు పెరిగిన ఆదరణ వల్ల నష్టాలు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం   వీటిపైన  ఎలాంటి లాభాలు లేకపోయినా నష్టాలు  తగ్గడమే తమకు పెద్ద ఊరట అని  ఆర్టీసీ ఉన్నతాధికారి  ఒకరు ‘సాక్షి’ తో  పేర్కొన్నారు.

టీ–24 టిక్కెట్‌లతో  పెరిగిన  ఆదరణ...
కేవలం రూ.160 తో  24 గంటల పాటు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా  అన్ని రకాల బస్సుల్లో పయాణించేందుకు ఆర్టీసీ  ఇటీవల  టీ–24 ( ట్రావెల్‌ 24 గంటలు)  అనే  ప్రత్యేక  పథకాన్ని  ప్రవేశపెట్టింది. మొదట్లో  ప్రతి రోజు  500 నుంచి  600 వరకు  విక్రయించిన ఈ టిక్కెట్‌లు  2 నెలలుగా  ప్రతి రోజు  2000 వరకు పెరిగాయి. ఈ  టిక్కెట్‌లపైన  ఏసీ బస్సుల్లో కూడా పయనించేందుకు అవకాశం ఉండడంతో  ఆక్యుపెన్సీ అనూహ్యంగా పెరిగింది. ఏసీ బస్సుల్లో  మార్చి నెలలో  53 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా  ప్రస్తుతం అది  63 శాతానికి పెరిగింది. ఆదాయం కూడా  పెరిగింది. మార్చిలో  మెట్రో లగ్జరీ  బస్సుల్లో   ఒక్కో బస్సుపైన సగటున రూ.12000 వరకు లభించగా, ఇప్పుడు  ఏకంగా  రూ.15000 ఆదాయం లభిస్తోంది. ఇలా  మొత్తం  80  ఏసీ బస్సులపైన ఈ నెల రోజుల్లో సుమారు రూ.3.6 కోట్ల వరకు లభించినట్లు అంచనా. ఈ  ఆదరణ ఇలాగే  ఉంటే ఏసీ బస్సులపైన  నష్టాలను పూర్తిస్థాయిలో  అధిగమించేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చునని  అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన  మెట్రో లగ్జరీ  బస్సులు  నగరంలోని పలు  ప్రధాన ప్రాంతాల నుంచి   ఐటీకారిడార్‌లకు  రాకపోకలు  సాగిస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌–పటాన్‌చెరు, ఈసీఐఎల్‌–వేవ్‌రాక్‌ (17హెచ్‌/10 డబ్ల్యూ), ఉప్పల్‌–వేవ్‌రాక్‌ (113ఎం/డబ్ల్యూ), కోఠీ–పటాన్‌చెరు (222,తదితర రూట్లలో ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement