Sakshi News home page

గ్యాస్ రీఫిల్లింగ్ అడ్డాల జల్లెడ

Published Fri, Jun 13 2014 2:57 AM

గ్యాస్ రీఫిల్లింగ్ అడ్డాల జల్లెడ

 సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో ప్రాణాంతకంగా మారిన ఎల్పీజీ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాల కోసం అధికారులు విస్తృతంగా జల్లెడ పడుతున్నారు. ఇటీవల జరిగిన అక్రమ రీఫిల్లింగ్ భారీ విస్ఫోటనం నేపథ్యంలో పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారులు రంగంలోకి దిగారు.  ఐదు రోజులుగా రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తూ పెద్ద సంఖ్యలో గృహవినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమార్కులపై కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు.  ఇప్పటి వరకు సుమారు 140 కేసులు నమోదు చేసి, 265 సిలిండర్లను సీజ్ చేశామని అధికారులు చెప్పారు.  

అక్ర మార్కులకు ఇప్పటి వరకు జరిమానా మాత్రమే విధిస్తున్న అధికారులు.. తాజా పేలుడు ఘటనతో క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లను సరఫరా చేసిన వారు గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో వారి లెసైన్స్, వినియోగదారులైతే కనెక్షన్ రద్దుకు సిద్ధమవుతున్నారు.  వంటగ్యాస్‌కు ఆధార్ బంధం తెగి, సిలిండర్ల సరఫరాపై నియంత్ర ణ లేకపోవడంతో అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
 
వణికిస్తున్న అక్రమ రీఫిల్లింగ్
 జనావాసాల్లో రహస్యంగా  కొనసాగుతున్న ఎల్పీజీ అక్రమ రీఫిల్లింగ్ దందా నగరవాసులను బెంబేలేత్తిస్తోంది. ఏ క్షణంలో ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు. సిటీలో రీఫిల్లింగ్  కేంద్రాలుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పాతిక రోజుల క్రితం పోలీసు టాస్క్‌పోర్సు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) డొమెస్టిక్ ఎల్పీజీ అక్రమ రీఫిల్లింగ్ వ్యవహారాలను బహిర్గతం చేసిన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ లోచలనం కలుగలేదు. ఇటీవల రీఫిల్లింగ్ కేంద్రలో విస్ఫోటనం జరిగి, కొందరి ప్రాణాలు కోల్పోవడంతో కళ్లు తెరిచిన అధికారులు హడావుడిగా తనిఖీలు మొదలెట్టా రు. అది కూడా బడా అక్రవు రీఫిల్లింగ్ కేంద్రాలను వదిలి చిన్న, చిన్న రీఫిల్లింగ్ కేంద్రాలు, చిరు హోటళ్లపైనే దృష్టి సారించి దాడులకు దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
మొక్కుబడి తనిఖీల్లోనే....
 సివిల్ సప్లై అధికారులు మొక్కుబడిగా నిర్వహిస్తున్న తనిఖీల్లోనే అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు, డొమెస్టిక్ కేంద్రాల అక్రమ వినియోగం పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం అధికారులు నిర్వహించిన గత రెండేళ్ల తనిఖీలను పరిశీలిస్తే... కేవలం నగరంలోని తొమ్మిది సర్కిల్స్‌లోనే  572 కేసుల  నమోదు చేసి 4586 సిలిండర్లను సీజ్ చేశారు. వీటిలో 4,320 సిలిండర్లను ప్రభుత్వం జప్తు చేసింది. గతేడాది మార్చి నెలలో కేవలం ఒక్క రోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సుమారు 2023 పైగా కేసులు నమోదు చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. తిరిగి తాజాగా గత ఐదు రోజుల నుంచి వరసగా దాడులు కొనసాగుతున్నాయి.
 
సర్కిళ్ల వారీగా త్రిసభ్య కమిటీ
 అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాల ఆటకట్టించేందుకు పౌరసరఫరాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సర్కిల్‌కు ఒక త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో పౌరసరఫరాల శాఖ సహా య అధికారితో పాటు పోలీసు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను సభ్యులుగా చేర్చారు. ఈ త్రిసభ్య కమిటీలు అక్రమ గ్యాస్‌రీఫిల్లింగ్ కేంద్రలను గుర్తించి దాడులు  చేస్తాయి.
 
ఫిర్యాదు సెల్ ఏర్పాటు...
 అక్రమ రీఫిల్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ హైదరాబాద్ సీఆర్వో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు, డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై  040- 23447770 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని హైదరాబాద్ డీఎస్‌ఓ రాజశేఖర్ తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement