ఇంట్లో ఉండగానే దోచేశాడు! | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఉండగానే దోచేశాడు!

Published Fri, Apr 29 2016 7:42 AM

ఇంట్లో ఉండగానే దోచేశాడు! - Sakshi

ఫిల్మ్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో భారీ చోరీ
* సీసీ కెమెరాలకు చిక్కకుండా ‘పని’ పూర్తి చేసిన చోరుడు
* కేజీకి పైగా బంగారం, రూ.5 లక్షల నగదు తస్కరణ

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ సమీపంలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ.. దాదాపు ఏరియా మొత్తం కవర్ చేస్తూ 12 సీసీ కెమెరాలు.. కాలనీ చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌తో ప్రహరీ గోడ.. భద్రతా విధుల కోసం నలుగురు సెక్యూరిటీ గార్డులు.. వీటన్నింటినీ తప్పించుకుని లోపలికి ప్రవేశించిన చోరుడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కేజీ బంగారం, రూ.5 లక్షల నగదు తస్కరించాడు. ఇంటి యజమానులు బెడ్‌రూమ్‌లో నిద్రిస్తుండగానే ఈ తంతు పూర్తిచేశాడు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
 
ఇంట్లో యజమానులు ఉండగానే..
నగరానికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి శ్యాంసుందర్ శర్మ ఫిల్మ్‌నగర్‌లోని అపర్ణ సినార్‌వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీలోని క్వార్టర్స్ నం.5లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి శర్మ, ఆయన భార్య సువర్ణశర్మ ఇంటికి లోపలి నుంచి తాళం వేసి మొదటి అంతస్తులో ఉన్న బెడ్‌రూమ్‌లో నిద్రపోయారు.  గురువారం ఉదయం నిద్రలేచిన శర్మ దంపతులు తమ గదిలోని వస్తువులు చిందరవందరగా పడిఉండటం, ఆభరణాల బాక్సులు బెడ్ పక్కన పేర్చి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీరువాలో ఉన్న 20  నెక్లెస్‌లు, ఒక వడ్డాణం, డైమండ్స్ సెట్, 12 జతల గాజులు, ఉంగరాలు ఇలా దాదాపు కేజీకి పైగా బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకుపోయినట్లు శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ.40 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. చోరీ జరిగిన బీరువాలో ఉన్న వన్‌గ్రామ్ బంగారు నగలను మాత్రం దొంగ ముట్టుకోకపోవడం గమనార్హం. ఆధారాల సేకరణకు పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి పరిశీలించారు. దొంగతనానికి వచ్చింది ఒక్కడేనని నిర్థారిస్తున్నారు.
 
ఆరితేరిన చోరుడిగా అనుమానం..
దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు పక్కా ప్రొఫెషనల్ చోరుడి పనిగా అనుమానిస్తున్నారు.  శబ్దం కాకుండా ‘పని’ పూర్తి చేయడం, శర్మ ప్యాంట్ జేబులోంచి తాళం చెవి తీసి బీరువా తెరవడం.. ఇవన్నీ ప్రొఫెషనల్స్ అనుసరించే పంథాలుగా చెప్తున్నారు. సెక్యూరిటీ గార్డులను విచారించిన పోలీసులు.. శర్మ ఇంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న, పాత పనివాళ్లు, డ్రైవర్లను విచారిస్తున్నారు.

సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో కొంత కాలంగా ఒకే చోరుడు పంజా విసురుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశిస్తున్న దొంగ కిటికీ స్క్రూలు తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో తొలగిస్తూ గ్రిల్‌ను పక్కన పెడుతున్నాడు. చోరీ చేసిన తర్వాత మళ్లీ గ్రిల్‌ను యథాస్థానంలో బిగిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఈ తరహాలో నాలుగైదు చోరీలు జరిగాయి.
 
పక్కా రెక్కీ.. తర్వాతే చోరీ..
గేటెడ్ కమ్యూనిటీలో 12 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవన్నీ ప్రధాన రహదారులు, బైలైన్స్‌ను మాత్రమే కవర్ చేస్తున్నాయి. దీనిని చోరుడు రెక్కీ ద్వారా ముందే గమనించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెమెరాలకు చిక్కకుండా తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో కమ్యూనిటీ వెనుక వైపు రామానాయుడు స్టూడియోకు ఆనుకుని ఉన్న ప్రాంతం నుంచి ఫెన్సింగ్ దాటుకొని లోపలకు ప్రవేశించినట్లు పోలీసు జాగిలాలు గుర్తించాయి. నేరుగా క్వార్టర్స్ నం.5 వద్దకు ప్రవేశించిన దొంగ చాకచక్యంగా మొదటి అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి కిటికీ గ్రిల్స్ తొలగించడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయి.

Advertisement
Advertisement