తుదికంటా ఉంత్కంఠ | Sakshi
Sakshi News home page

తుదికంటా ఉంత్కంఠ

Published Sun, Jan 17 2016 12:57 AM

తుదికంటా ఉంత్కంఠ - Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ప్రధాన పార్టీలు అనేక డివిజన్లకు శనివారం రాత్రి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ ప్రాంతాలకు టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. మరి కొందరు ఓ అడుగు ముందుకేసి... రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఈ బెడద వెంటాడుతోంది. టీడీపీ-బీజేపీల మధ్య సీట్ల పంపకం వివాదానికి దారి తీసింది. శనివారం రాత్రికి సీట్ల సంఖ్యపై ఈ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అభ్యర్థులు ఖరారు కావలసి ఉంది.
 
సిటీబ్యూరో: టిక్..టిక్..టిక్.. ఎడతెగని సంప్రదింపులు.. చర్చలు.. పొత్తు పొడుపులు... ఆశావహుల్లో క్షణక్షణం.. టెన్షన్.. టెన్షన్.. అన్ని పార్టీల క్యాడర్‌లో అయోమయం. అన్ని డివిజన్లకూ తమ పార్టీల అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారోనన్న సస్పెన్స్. బల్దియా సమరాంగణంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఉత్కంఠగా మారింది. శనివారం ఇదే అంశంపై ప్రధాన రాజకీ య పక్షాల్లో హైడ్రామా నెలకొంది. గెలుపు గుర్రాల అన్వేషణలో ప్రధాన పార్టీలు పెద్ద కసరత్తే చేశాయి. తమ రాజకీయ అనుభవంతో ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందించాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ప్రకటించే వరకు తమ అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదు. వారి బలాబలాలను పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాలన్న ఎత్తుగడను అనుసరించాయి. రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజానీకం సైతం ఇవే చర్చలతో గడపడం గమనార్హం. కొందరు టీవీలకు అతుక్కుపో యి తాజా రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనించడం విశేషం. మరో వైపు అధికార టీఆర్‌ఎస్‌లో రె‘బెల్స్’ మోగాయి. టీడీపీ-బీజేపీల్లో సీట్ల పంపకం గొడవలకు దారి తీసింది.

అధికార గులాబీ పార్టీలో...
గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. అధికార టీఆర్‌ఎస్ సంక్రాంతి పర్వదినమైన శుక్రవారమే రెండు విడతలుగా 80 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 70 డివిజన్లలో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయాల్సిందిగా ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. దీంతో  శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం తెలియక ఒక్కో డివిజన్‌కు ముగ్గురు నుంచి ఐదుగురేసి ఔత్సాహికులు శనివారమే నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. టిక్కెట్లు దక్కని వారు రెబెల్స్‌గాబరిలో నిలుస్తామని స్పష్టం చేస్తుండడం గమనార్హం. వారంతా అగ్రనేతలను కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్యమ సమయం నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలు, డబ్బున్న వారికే టిక్కెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ-బీజేపీల మధ్య హైడ్రామా
బీజేపీ-టీడీపీల మధ్య పొత్తు పొడిచింది. టీడీపీ 87, బీజేపీ 63 స్థానాల్లో పోటీకి సీట్ల సర్దుబాటు పూర్తయింది. శివారు డివిజన్ల విషయంలో ఇరుపార్టీల నేతల మధ్య సయోధ్య కుదరలేదు. ప్రధాన నగరంలో మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. శివారు ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలు టీడీపీకి ఇవ్వడం వల్ల తమకునష్టం జరుగుతుందని.. కొన్ని డివిజన్లు కేటాయించాలని బీజేపీ పట్టుబట్టింది. తమకు బలమున్న డివిజన్లను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అభ్యంతరం చెప్పింది. దీంతో ఇరుపార్టీల మధ్య శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. సాయంత్రం 6 గంటలకు ఇరుపార్టీల నేతలు జూబ్లీహిల్స్‌లోని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కార్యాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.  గ్రేటర్‌లో ప్రస్తుతం అనుకూల పవనాలు వీస్తున్నాయని... సెటిలర్ల ఓట్లన్నీ తమకే పడతాయని... సుమారు 55 డివిజన్లలో విజయం తథ్యమని సర్వేలో తేలిందని నగర బీజేపీ నేతలు వాదించినట్లు సమాచారం. తమ వద్ద నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లోని డివిజన్లను బీజేపీకి కేటాయించే ప్రశ్నే లేదని టీడీపీ భీష్మించుకు కూర్చున్నట్లు తెలిసింది. రాత్రి 8 గంటల తర్వాత వ్యవహారం కొలిక్కి వచ్చింది. బీజేపీ 63... టీడీపి 87 డివిజన్లలో పోటీకి నిర్ణయించాయి.  
కాంగ్రెస్ పార్టీలో...
కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సా..గుతోంది. ఇప్పటి వరకు 45 మందిని ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు
భట్టివిక్రమార్క తదితర సీనియర్ నేతలు శనివారం నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు, ముఖ్యనేతలు, ఔత్సాహికులతో చర్చిం చారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇదే పరిస్థితి. జాంభాగ్ డివిజన్ నుంచి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రంగౌడ్, తార్నాక నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి నామినేషన్లు వేశారు.
 
ఎంఐఎంలో..
మజ్లిస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికలో దారుస్సలాంలో హైడ్రామా చోటుచేసుకుంది. శనివారం రాత్రి వరకు అధికారికంగా జాబితాను ప్రకటించనప్పటికీ కొందరు సీనియర్ సిట్టింగ్ కార్పొరేటర్లు, మరి కొందరు కొత్త ముఖాలకు నామినేషన్ వేసుకునేందుకు వ్యక్తిగతంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాలు జారీ చేశారు. శనివారం సుమారు 27 మంది మజ్లిస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. ఒక రోజు మాత్రమే గడువు ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలోదారుస్సలాంకు తరలి వచ్చారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు దారుస్సలాంలోని ప్రత్యేక గదిలో కూర్చొని ఉదయం నుంచి రాత్రి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని పిలిపించుకొని సుదీర్ఘంగా చర్చించి.. బయటకు పంపించారు. వారిలో కొందరికి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోమని... మరికొందరికి పార్టీ కోసం పని చేయాలని చెప్పారు. అభ్యర్థిత్వాల ఖరారు సంకేతాలు లభించిన వారికి పార్టీ ఎన్నికల విభాగం సిబ్బంది అక్కడికక్కడే బాండ్ పేపర్‌తో సహా నామినే షన్ పత్రాలను సిధ్ధం చేసి అందించారు. ఆశావహులు పెద్ద ఎత్తున తరలి వచ్చినప్పటికీకొందరికి మాత్రమే ప్రత్యేక గదిలోకి ఆహ్వానం లభించింది. డివిజన్ల రిజర్వేషన్‌తో మైనార్టీయేతరులు కూడా అధిక సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలిరావడంతో సందడి నెలకొంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement