విపత్కర పరిస్థితుల్లో బాలికలు | Sakshi
Sakshi News home page

విపత్కర పరిస్థితుల్లో బాలికలు

Published Sun, Jan 31 2016 5:16 AM

విపత్కర పరిస్థితుల్లో బాలికలు - Sakshi

♦ వారి సంక్షేమానికి ఏదో ఒకటి చేయాలి
♦ పుట్టిన వెంటనే ప్రతి బాలికకూ యూనిక్ నంబర్ ఇవ్వండి
♦ ‘బేటీ పఢావో.. బేటీ బచావో’ అమలుపై వివరాలివ్వండి
♦ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: సమాజంలో ప్రస్తుతం బాలికలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమం కోసం నిర్దిష్టంగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. బాలికల పరిస్థితి దారుణంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక పుట్టిన వెంటనే ఓ యూనిక్ నంబర్ కేటాయించాలని, 15-16 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ యూనిక్ నంబర్ ద్వారా ఆమె పురోగతిని పర్యవేక్షిస్తూ ఉండాలని హైకోర్టు తెలిపింది.

ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాలికలకు అందుతున్నాయో లేదో కూడా యూనిక్ నంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా బాలికలకు సముచిత న్యాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. గ్రామస్థాయి నుంచి ఇది అమలైతే ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉంటాయంది. దీనిపై లోతుగా ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అదే విధంగా బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ పఢావో-బేటీ బచావో పథకం అమలు తీరుపై అధ్యయనం చేసి, వివరాలను కోర్టు ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్, ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

 ప్రత్యూష కేసు మరోసారి విచారణ..
 ప్రత్యూషను ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల తీవ్రంగా హింసించి, ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం ఇటీవల దాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా స్పెషల్ జీపీ శరత్‌కుమార్ స్పందిస్తూ, ప్రత్యూష తల్లికి చెందిన ఫ్లాట్‌ను ప్రత్యూషకు గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్టర్ చేశారని కోర్టుకు నివేదించారు. అయితే అద్దెకుంటున్న వారికి, ప్రత్యూషకు మధ్య అద్దె ఒప్పందం కుదిరేలా చూసి, అద్దె మొత్తం ప్రతినెలా ప్రత్యూష బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

 ప్రత్యూషలాగే ఇబ్బందులు పడుతున్న బాలికల సంగతేమిటని, వారి సంక్షేమం కోసం ఏం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఏపీ ఏజీ వేణుగోపాల్ స్పందిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు ఉన్నాయని చెప్పగా, అవి గ్రామస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పథకాలు టీవీలు, పేపర్లలో కనిపిస్తే చాలదని, అవి క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించింది.

Advertisement
Advertisement