రూ. 3 వేల కోట్లు ఇవ్వండి | Sakshi
Sakshi News home page

రూ. 3 వేల కోట్లు ఇవ్వండి

Published Sat, Dec 19 2015 12:16 AM

రూ. 3 వేల కోట్లు ఇవ్వండి

♦ వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్ర ఆర్థిక సహకారం కోరిన రాష్ట్రం
♦ కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శికి ప్రాథమ్యాల వివరణ
♦ మిషన్ కాకతీయకు ట్రిపుల్ ఆర్ కింద రూ. 400 కోట్లు కావాలని విజ్ఞప్తి
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రతీ నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టులకు భారీగా సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మిషన్ కాకతీయ సహా పలు కీలక ప్రాజెక్టుల పనులకు వివిధ కేంద్ర పథకాల కింద రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి నిఖిలేష్ ఝాతో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయప్రకాశ్ శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో రూ. 1.05 లక్షల కోట్లు వెచ్చించి 60 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకం లక్ష్యాలు, బడ్జెట్ అవసరాలను కేంద్ర అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు.

కొత్త ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 10 వేల కోట్లు వెచ్చిస్తామన్నారు. రెండో దశలో 650 చెరువులు, మూడో దశలో 1,210 చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని, వీటికి ట్రిపుల్ ఆర్ కింద అవసరమైన రూ. 412 కోట్లు, దేవాదులకు సంబంధించి పెండింగ్ నిధులు రూ.422 కోట్లు, నిజాంసాగర్ ఆధునీకరణకు ఏఐబీపీ కింద రూ. 978 కోట్లు, మోదికుంటవాగుకు రూ. 456 కోట్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు శ్రీరాంసాగర్ వరద కాల్వకు సంబంధించి తాజా అంచనా రూ. 5,887 కోట్లకు ఆమోదం తెలపాలని, అలాగైతేనే అందులో 20శాతం నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతాయని వివరించారు. రాష్ట్ర భూగర్భ శాఖ ప్రతిపాదించిన 42 మండలాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ రీచార్జ్ ప్రణాళికను వెంటనే ఆమోదించాలని కోరారు. కేంద్ర జల సంఘం సూచన మేరకు ప్రాణహిత-చేవెళ్ల పథకం డిజైన్‌లో మార్పులు చేసి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపడుతున్నామని వివరించిన మంత్రి హరీశ్‌రావు.. దీనిపై త్వరలోనే కేంద్రానికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందజేస్తామని తెలిపారు.

 నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి: నిఖిలేష్ ఝా
 రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర నీటి పారుదల ప్రణాళికను నిఖిలేష్‌ఝా ప్రశంసించారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, భూగర్భ శాఖలతో కలసి రాష్ట్ర సాగునీటి ప్రణాళికను తయారు చేయాలన్నారు. సాగుకోసం వినియోగించే నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాంటి వాటిని వినియోగించేవారికి కేన్సర్ల వంటి వ్యాధులు వస్తున్నాయన్నారు. దీనికి తెలంగాణలో మూసీ నది ఉదాహరణ అని, అందుకే నీటి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మిషన్ కాకతీయ ప్రయోగాన్ని ప్రశంసిస్తూనే.. కేంద్రం తెచ్చిన ‘వన్ డ్రాప్-మోర్ క్రాప్’ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధం చేసిన ఇరిగేషన్ ప్రణాళికలను అధ్యయనం చేసి అందులోని అంశాలను గ్రహించే యత్నం చేయాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement