డ్రా చేసిన కొద్దిసేపటికే డబ్బులు పోయాయ్.. | Sakshi
Sakshi News home page

డ్రా చేసిన కొద్దిసేపటికే డబ్బులు పోయాయ్..

Published Fri, Dec 2 2016 9:37 PM

gorigey chandraiah lost money in hayath nagar

హయత్‌నగర్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు అన్నీఇన్నీ కాదు. రూ.2 వేల నోటు మాత్రమే బ్యాంకులు, ఏటీఎంలలో ఇస్తుండడంతో డబ్బుల కోసం రోజులతరబడి వాటి వద్ద క్యూలు గట్టాల్సి వస్తోంది. అయితే రాష్ర్ట ప్రభుత్వం చొరవతో డిసెంబర్ 1నుంచి ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రూ.10వేలు నగదు రూపేణా అందజేసేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఆర్‌అండ్‌బీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన హయత్‌నగర్‌కు చెందిన గొరిగె చంద్రయ్య శుక్రవారం స్థానిక ఎస్‌బీహెచ్‌కు వచ్చి రెండు గంటల సేపు క్యూలో నిలుచుని రూ.10వేలు డ్రా చేసుకున్నారు.

అన్నీ వంద రూపాయల నోట్లే వచ్చాయి. అయితే డబ్బు పొందిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. డ్రా చేసిన డబ్బులు, పాస్‌బుక్‌ను చొక్కా లోపల వేసుకున్నాడు. బజారులోకి వెళ్లి ఖర్చు కోసం డబ్బులు తీయాలనుకునేసరికి అవి కనిపించలేదు. దీంతో పరుగుపరుగున బ్యాంకుకు తిరిగి వచ్చిన చంద్రయ్య డబ్బు కోసం అంతటా వెతికారు. తన డబ్బులేమైనా దొరికాయా అంటూ ఆయన అందరినీ అడగడం జాలి కలిగించింది. ఎంత వెదికినా డబ్బు దొరకకపోవడంతో ఉసూరుమంటూ వెళ్లిపోయారు.

Advertisement
Advertisement