వచ్చింది రెండు టీఎంసీలే! | Sakshi
Sakshi News home page

వచ్చింది రెండు టీఎంసీలే!

Published Mon, Jun 27 2016 3:49 AM

వచ్చింది రెండు టీఎంసీలే!

- వర్షాకాలం మొదలై 25 రోజులైనా ప్రాజెక్టుల్లోకి నీరు అంతంతే
- కృష్ణా, గోదావరి బేసిన్‌లోని రాష్ట్ర ప్రాజెక్టుల్లో వర్షాభావ పరిస్థితులు
- గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణం
- గతేడాదితో పోలిస్తే 90 టీఎంసీల మేర తక్కువ నీరు
 
 సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలై 25 రోజులైనా కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. రాష్ట్ర పరీవాహకంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం 2 టీఎంసీల నీరు మాత్రమే రావడం ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. దిగువకు నీటిని ధారపోసే ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులే నీటి కొరతను ఎదుర్కోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. కర్ణాటకలో కేవలం 6.5 టీఎంసీల మేర నీరు మాత్రమే వచ్చింది. ఎగువ ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే ఈ ఏడాది ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనంగా మారనుంది.

 ఎగువన రాకుంటే దిగువకు కష్టమే..
 కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గ ణనీయంగా నీటి మట్టాలు పడిపోయాయి. రాష్ట్ర ప్రాజెక్టుల్లో 4-5 టీఎంసీలకు మించి వినియోగార్హమైన నీరు లేదు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 504.6 అడుగులకు తగ్గగా నీటి నిల్వ 122.69 టీఎంసీలకు చేరింది. ఇందులో ఒకట్రెండు టీఎంసీలకు మించి వాడుకోవడానికి లేదు. శ్రీశైలంలో వాస్తవ నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 779 అడుగులకు పడిపోయింది. అక్కడ వాస్తవ నీటి నిల్వ 215.8 టీఎంసీలకుగానూ 20.19 టీఎంసీలకు పడిపోయింది. గతేడాది ఈ సమయానికి 2 ప్రాజెక్టుల్లో కలిపి 25 టీఎంసీల మేర నీరు తక్కువగా ఉంది. జూరాల వాస్తవ సామర్థ్యం 11.9 టీఎంసీలుకాగా గతేడాది 6.17 టీఎంసీలు ఉండగా ఈ ఏడాది కేవలం 2.8 టీఎంసీల నీరు ఉంది.

ఈ ఏడాది వర్షాకాలం ఆరంభమై నెల కావస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీరు కేవలం 2 టీఎంసీలు మాత్రమే. తుంగభద్ర పరీవాహకంలో కురిసిన వర్షాల కారణంగా వచ్చిన ప్రవాహాలతో జూరాలలో 0.62 టీఎంసీల నీరు రాగా, శ్రీశైలంలో 1.47 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. జూరాలకు 1,464 క్యూసెక్కులు, శ్రీశైలంలో 1,374 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇది మినహా ఎక్కడా చుక్క నీరు ప్రాజెక్టుల్లో చేరలేదు. దీనికితోడు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 205 టీఎంసీల నీటి కొరత ఉంది. గత 25 రోజుల్లో ఎగువ ప్రాజెక్టుల్లో మొత్తంగా కేవలం 6.5 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఇందులో అత్యధికంగా నారాయణపూర్‌లో 4 టీఎంసీల మేర నీరు చేరింది. గతేడాది ఎగువన ప్రాజెక్టుల్లో ఇదే సమయానికి 42 టీఎంసీల మేర కొత్త నీరురాగా ఈ ఏడాది అక్కడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 గోదావరిలో చుక్క నీరు లేదు..
 గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, కడెం, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల  నీటి నిల్వ సామర్థ్యం 198 టీఎంసీల మేర ఉండగా ప్రస్తుతం లభ్యతగా ఉన్నది కేవలం 12.23 టీఎంసీలు మాత్రమే. గతేడాది నిల్వలతో పోలిస్తే సుమారు 14 టీఎంసీల మేర తక్కువగా లభ్యత నీరుంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ మొదలు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టులోకి ఇప్పటిరవకు కొత్తగా చుక్క నీరు చేరలేదు.

Advertisement
Advertisement