‘సహన’ వైద్యానికి సర్కారు సాయం | Sakshi
Sakshi News home page

‘సహన’ వైద్యానికి సర్కారు సాయం

Published Wed, Apr 20 2016 3:45 AM

‘సహన’ వైద్యానికి సర్కారు సాయం - Sakshi

హైదరాబాద్: ‘సహన‘ తలరాతను మారుద్దాం.. అనే శీర్షికతో ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సహన వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. రెండు లక్షలు మంజూరయ్యాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావుగౌడ్ మంగళవారం మంజూరుపత్రాన్ని అందజేశారు. మరో లక్ష రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో లక్ష రూపాయల సహాయం అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కొంతసేపు సహనతో ముచ్చటించారు. ఆమె ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. 
 
సహనకు మెరుగైన వైద్యం చేయించాలనీ స్థానిక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి హరిని మంత్రి పురమాయించారు. సికింద్రాబాద్ నియోజక వర్గం తార్నాక డివిజన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన లక్ష్మమ్మ మనుమరాలు సహన(10) చిన్నప్పటి నుంచి వింత వ్యాధితో బాధపడుతోంది. పేదరికం కారణంగా కుటుంబసభ్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సహన దీనస్థితిపై ‘సాక్షి’లో కథనం రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సహన కుటుంబసభ్యులు, స్థానికులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు. 

Advertisement
Advertisement