హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం! | Sakshi
Sakshi News home page

హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం!

Published Sat, Feb 22 2014 12:55 AM

government leads on health card steering commitee

 సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డుల పథకం అమలును పర్యవేక్షించడానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు కమిటీ కూర్పు ప్రతిపాదన రూపొందించి శుక్రవారం ఉద్యోగ సంఘాల ముందు పెట్టింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జీఏడీ కార్యదర్శి ఎస్.కె.సిన్హా శుక్రవారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. 18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నామని, అందులో 11 మంది అధికారులు, ఏడుగురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించనున్నామని సిన్హా తెలిపారు.


  ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 12 శాశ్వత సభ్య సంఘాలు, ఇద్దరు పెన్షనర్ల ప్రతినిధులు, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులకు చోటు కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశాయి. హెల్త్‌కార్డుల పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, తర్వాతే స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తానని సిన్హా హామీ ఇచ్చారు. ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, డ్రైవర్ల సంఘం, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
 
 శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత పెంపు
 శంషాబాద్, న్యూస్‌లైన్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు బందోబస్తును పటిష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఓ విమానాన్ని పేల్చివేస్తామంటూ విమానాశ్రయానికి ఓ అగంతకుడి నుంచి లేఖ వచ్చినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఎయిర్‌పోర్టు అధికార వర్గాలు, పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు జరిగి ఏడాదైన సందర్భంగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే బందోబస్తును పటిష్టం చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement