ప్రభుత్వ ఆసుపత్రుల్లో ’జన ఔషధి’ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ’జన ఔషధి’

Published Tue, Jan 19 2016 3:12 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ’జన ఔషధి’

- అత్యంత చవకగా అందుబాటులోకి జనరిక్ మందులు
- జిల్లా, రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో దుకాణాలు
- ప్రైవేటు వైద్యులు రాసిన మందులనూ వీటిలో కొనుగోలు చేయొచ్చు
- బ్రాండెడ్‌తో పోలిస్తే పదో వంతు ధరకే లభ్యం
- హెచ్‌ఎల్‌ఎల్ కంపెనీకి దుకాణాల ఏర్పాటు బాధ్యత
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఆస్పత్రులు, పెద్దాసుపత్రుల్లో అతి చవకగా మందులు, ఔషధాలు లభించనున్నాయి. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల్లో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ వంటి రాష్ట్రస్థాయి ఆసుపత్రులు, అన్ని బోధనాసుపత్రుల్లో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ జనరిక్ మందులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కిందే 25 దుకాణాలను మంజూరు చేసింది. కానీ పలు కారణాలతో వాటిని నెలకొల్పడంలో ఆలస్యం జరిగింది. ఈ జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయడం వల్ల రోగులకు అత్యంత చవకగా మందులు, ఇతర ఔషధాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నా... ప్రైవేటు వైద్యుల వద్ద చూపించుకున్న రోగులు కూడా ఈ దుకాణాల్లో మందులు కొనుగోలు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ చెప్పారు. హెచ్‌ఎల్‌ఎల్ కంపెనీకి జనరిక్ దుకాణాలను నెలకొల్పే బాధ్యతను కేంద్రం అప్పగించిందని తెలిపారు.

ఏమిటీ జనరిక్..?
ఏవైనా మందులు, ఔషధాలను ప్రత్యేకమైన బ్రాండ్ పేరుతో కాకుండా... సంబంధిత మందు/ఔషధం పేరుతోనే పేర్కొనడాన్ని ‘జనరిక్’గా చెప్పవచ్చు. అంటే సాధారణంగా జ్వరానికి వాడే పారాసిటమాల్ అనే మందును వివిధ కంపెనీలు వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తాయి. ఒక్కో కంపెనీ తమకు ఇష్టం వచ్చిన ధరను ప్యాకింగ్‌లపై ముద్రిస్తాయి. అదే జనరిక్‌గా అయితే ఈ మందుపై పేరు ‘పారాసిటమాల్’గానే ఉంటుంది. దాని అసలు ధరను ముద్రిస్తారు.

వాస్తవానికి భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం... వైద్యులు వారు సూచించే మందుల జనరిక్ పేర్లను మాత్రమే ప్రిస్కిప్షన్‌పై రాయాలి. దుకాణదారులు కూడా మందు పేరుతోనే విక్రయాలు జరపాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఉదాహరణకు పారాసిటమాల్ మందును వాడాలని వైద్యులు సూచించాలనుకుంటే... ఆ మందు పేరునే ప్రిస్కిప్షన్‌పై రాయాలి. కానీ తమకు ఇష్టమైన కంపెనీ తయారు చేసే పారాసిటమాల్ మందు బ్రాండ్ పేరునే రాస్తుంటారు. దాంతో ఎక్కువ ధర ఉండే ఆ బ్రాండ్ పారాసిటమాల్ మందునే దుకాణదారులు ఇస్తుంటారు.

అత్యంత చవకగా..
జనరిక్ మందుల దుకాణాల్లో విక్రయించే మందుల ధరలు అత్యంత చవకగా ఉంటాయి. కంపెనీ నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నందున ఇతరత్రా ఖర్చు ఏమీ ఉండదు. కాబట్టి ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు పారాసిటమాల్ 500 మిల్లీగ్రాముల(ఎంజీ) మోతాదు ఉండే 100 గోలీల (టాబ్లెట్ల)ను బ్రాండెడ్ కంపెనీలు రూ. 130కు విక్రయిస్తుంటే... జనరిక్ దుకాణాల్లో వాటిని రూ. 30 కే పొందవచ్చు. అలాగే సిట్రిజన్ 10 ఎంజీ మోతాదున్న 100 టాబ్లెట్లను బ్రాండెడ్ కంపెనీలు రూ. 260 వరకు అమ్ముతుండగా... జనరిక్ దుకాణాల్లో రూ. 20కే లభ్యమవుతాయి.

లాభాపేక్ష లేకుండా ఔషధాలను పేద రోగులకు అందించాలనేది ఈ దుకాణాల ముఖ్య ఉద్దేశం. మందులను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి హెచ్‌ఎల్‌ఎల్ సంస్థకు అందజేస్తుంది. ఆ సంస్థ వాటిని దేశవ్యాప్తంగా దుకాణాలకు సరఫరా చేసి విక్రయిస్తుంది. ఈ జనరిక్ దుకాణాలకు అవసరమైన స్థలం, విద్యుత్, సిబ్బందిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.

బ్రాండెడ్ జనరిక్ ఔషధాల కోసం..
అడ్రస్‌లేని కంపెనీల జనరిక్ ఔషధాలతో సమస్యలు వస్తున్నాయని, ప్రస్తుతం ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న నాసిరకం మందులను నిరోధించాలని రాష్ట్ర సర్కారు మొదట్లో భావించింది. హైదరాబాద్ కేంద్రంగా అనేక ఫార్మసీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తున్నందున... రాష్ట్ర ప్రజల కోసం తక్కువ ధరకు నాణ్యమైన ఔషధాలను తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరాలనే దిశగా ఆలోచన చేసింది.

కానీ అయితే దానిపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా కేంద్రం అమల్లోకి తెచ్చిన జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. ఇక జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులందరికీ ఉచితంగా మందులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే మందులను కొనుగోలు చేసి.. సరఫరా చేయనుంది. మొత్తంగా జనరిక్ మందుల దుకాణాలు, ఉచిత మందుల నిర్ణయం అమల్లోకి వస్తే పేద రోగులకు ప్రయోజనం కలుగనుంది.

Advertisement
Advertisement