సింధోత్సవం అదిరింది | Sakshi
Sakshi News home page

సింధోత్సవం అదిరింది

Published Tue, Aug 23 2016 12:24 AM

సింధోత్సవం అదిరింది

భారత బ్యాడ్మింటన్ స్టార్‌కు జన నీరాజనం
సత్కారాలు, అభినందనల వెల్లువ


రోడ్ల వెంట బారులు తీరిన వేలాది మంది జనం... పసివారి నుంచి పండు ముదుసలి వరకు అందరి నోటా ఒకటే జపం... జాతీయ పతాకం చేతబూని జయజయధ్వానాలు చేస్తున్న అభిమానం... ఇందులో బ్యాడ్మింటన్‌ను ఇష్టపడేవారు ఉన్నారు, ఆట గురించి తెలియని వారూ ఉన్నారు. కానీ అందరిలోనూ ఒకటే భావన... ‘మన అమ్మాయి’ దేశ గౌరవం నిలబెట్టింది. ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతకాన్ని ఎగురవేసిన తెలుగమ్మాయికి ‘జయహో సింధు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆపై వరుస సత్కారాలు, సన్మానాలతో సోమవారం హైదరాబాద్ నగరం సింధు జపంతో ఊగిపోయింది.


హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగతం పలికింది. రియో నుంచి కోచ్ గోపీచంద్‌తో కలిసి సింధు సోమవారం నగరానికి చేరుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో పౌర సన్మానంతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కూడా సింధును ప్రత్యేకంగా అభినందించారు.

 
దారి పొడవునా హుషారు

సింధు సొంతగడ్డకు రానున్న వార్త తెలియడంతో సోమవారం ఉదయం నుంచే శంషాబాద్ విమానాశ్రయం మొదలు ర్యాలీ సాగిన మార్గంలో సందడి నెలకొంది. ఉదయం 8.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సింధుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు ఇతర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర పర్యాటక శాఖనుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘బెస్ట్’ ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర ప్రారంభమైంది. సింధు వెంట కోచ్ గోపీచంద్, ఫిజియో కిరణ్ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ పరిసరాలు దాటి శంషాబాద్ గ్రామంలోకి ప్రవేశించే వరకు ర్యాలీ వేగంగా సాగిపోయింది.

 
విద్యార్థుల స్వాగతం

ర్యాలీ కోసం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేడియం వరకు భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు పెట్టారు. ర్యాలీ సాగిన మార్గంలో గగన్ పహాడ్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, అత్తాపూర్, టోలీచౌకి, దర్గా పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దారి పొడవునా నిలబడి సింధుకు ఘన స్వాగతం పలికారు. చేతుల్లో జాతీయ జెండాలతో చిన్నారులు కంగ్రాట్స్ చెప్పడం ఆకట్టుకుంది. వీరికి ప్రతిస్పందనగా థ్యాంక్స్ చెబుతూ తన రజత పతకాన్ని ప్రదర్శిస్తూ సింధు ముందుకు సాగిపోయింది. మొత్తం మార్గంలో స్వాగతం పలికేందుకు పదికి పైగా చోట్ల ప్రత్యేక వేదికలు నిర్మించారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి కూడా కొన్ని చోట్ల బస్సుపై పూల వర్షం కురియడంతో సింధు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికేందుకు రోడ్డుపైకి రావడం, ట్రాఫిక్ జామ్ కారణంగా అనుకున్న సమయంకంటే ర్యాలీ ఎక్కువ సేపు సాగింది.

 

దేశానికి సింధు గర్వకారణం: నరసింహన్
హైదరాబాద్: తల్లి, తండ్రి, గురువు, దైవ శక్తుల సమష్టి దీవెనలతో పీవీ సింధు దేశ పేరుప్రతిష్టలు పెంచిందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. ఆమె విజయాలను చూసి దేశం గర్వపడుతోందన్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు తన కుటుంబసభ్యులు, కోచ్ గోపీచంద్‌తో కలిసి సోమవారం గవర్నర్‌ను కలిసింది. రాజ్‌భవన్ సిబ్బంది వీరికి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... సింధు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం అన్నారు. ఆమె పతకం గెలుస్తుందని గోపీచంద్ గతంలో తనతో చెప్పారని, బహుశా ఆయనకు జ్యోతిష్యం తెలిసి ఉండవచ్చని ఆయన చలోక్తులు విసిరారు. గవర్నర్‌కు పతకాన్ని చూపించిన సింధు, తన విజయానికి దేవుడు సహకరించాడని చెప్పింది. తన అకాడమీ నిర్వహణలో అనేక సందర్భాల్లో సహకరించిన గవర్నర్‌కు ఈ సందర్భంగా గోపీచంద్ కృతజ్ఞతలు చెప్పారు.  అనంతరం సింధు, గోపీలకు జ్ఞాపికలు అందించిన గవర్నర్... అకాడమీ అభివృద్ధి కోసం రూ. 2 లక్షలు ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement