సాగుకు జీఎస్టీ దెబ్బ..! | Sakshi
Sakshi News home page

సాగుకు జీఎస్టీ దెబ్బ..!

Published Thu, Jun 15 2017 1:55 AM

సాగుకు జీఎస్టీ దెబ్బ..! - Sakshi

తెలంగాణ రైతులకు భారంకానున్న వస్తుసేవల పన్ను
- వ్యవసాయ యంత్రాల ధరలకు రెక్కలు
12 శాతం పెరగనున్న సబ్సిడీ ట్రాక్టర్‌ ధర
వరి, చెరకు కోత యంత్రాల ధర భారీగా పెరుగుదల
2017–18 ధరలపై ఆగ్రోస్‌ టెండర్లు దాదాపు ఖరారు
 
సాక్షి, హైదరాబాద్‌: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి వస్తే వ్యవసాయ యంత్రాలు రైతులకు మరింత భారం కానున్నాయి. ఒకవైపు కంపెనీల విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల ధరలను కొంతమేర పెంచుతుండగా, మరోవైపు జీఎస్టీ రైతుల నడ్డి విరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూలీల కొరత నేపథ్యంలో సాగుకు యాంత్రీకరణే మార్గమని భావిస్తున్న తరుణంలో రైతులపై భారం మోపేలా యంత్రాల ధరలు పెరగనున్నాయి. జూలై నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయి. 2017–18 సంవత్సరానికి వ్యవసాయ యంత్రాల ధరలను ఖరారు చేసే పనిలో తెలంగాణ ఆగ్రోస్‌ నిమగ్నమైంది. దాదాపు 350 వరకు వివిధ రకాల వ్యవసాయ యంత్రాల ధరలను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే టెండర్లు పిలవడం, ధరలపై కంపెనీలతో చర్చలు జరపడం పూర్తయింది. ధరలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. టెండర్లలో దాదాపు 400 దేశ విదేశీ కంపెనీలు పాల్గొన్నట్లు అంచనా.
 
12 శాతం పెరగనున్న ట్రాక్టర్ల ధరలు..
వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించింది. అలాగే కేంద్రం నుంచి రూ.134 కోట్లు రానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై.. ఇతర వర్గాల రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేస్తుండటంతో రైతుల్లో యంత్రాల వినియోగంపై ఆసక్తి పెరిగింది. అయితే జీఎస్టీ దెబ్బ రైతుల ఆశలపై నీళ్లు చల్లనుంది. జీఎస్టీ భారంతో వ్యవసాయ యంత్రాల ధరలు అమాంతం పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు 15 వేల ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందజేయాలని నిర్ణయించింది. 42 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్‌ ధర గతంలో రూ.5.65 లక్షలుండగా, ఈసారి కంపెనీల విన్నపంతో రూ.5.90 లక్షలకు పెంచే అవకాశముంది. దీనికి 12 శాతం జీఎస్టీ భారం పడనుంది. అలాగే 45 హెచ్‌పీ ట్రాక్టర్ల ధర గతంలో 6.98 లక్షలుండగా, ఈసారి కూడా అదే ధరను ఖరారు చేశారు.

కానీ 12 శాతం జీఎస్టీ భారం ఈ ట్రాక్టర్లపై పడనుంది. 21 హెచ్‌పీ ట్రాక్టర్ల ధర 3.80 లక్షలుంటే, వాటికీ 12 శాతం అదనపు జీఎస్టీ భారం పడనుంది. ఇప్పటివరకు పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో తయారయ్యే ట్రాక్టర్లపై వ్యాట్‌ ఉండేది కాదు. జీఎస్టీ 12 శాతం కావడంతో అవన్నీ కూడా ధరలు పెంచనున్నాయి.
 
తైవాన్‌ స్ప్రేయర్లపై 28 శాతం భారం..
చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉపయో గించే తైవాన్‌ స్ప్రేయర్లపై 28 శాతం జీఎస్టీ విధించారు. ప్రస్తుతం వీటి ధర రూ.28 వేలుండగా, జీఎస్టీతో ఏకంగా రూ.36 వేలు కానుంది. అత్యంత సాధారణమైన నాగళ్లపైనా 12 శాతం జీఎస్టీ విధించారు. వీటి ధర రూ.2 వేలుంటే.. జీఎస్టీతో అవీ పెరగనున్నాయి. వరి కోత యంత్రాల ధర రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షలు కానుంది. చెరకు కోత యంత్రం ధర రూ.కోటి నుంచి రూ.1.12 కోట్లు కానుంది. ఏటా 10 వేల మంది రైతులుకొనే రోటావేటర్ల ధర ఆయా రకాల్ని బట్టి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. వీటిపైనా 12 శాతం జీఎస్టీ భారం పడనుంది.
 
గ్రీన్‌హౌస్‌.. రూ.18 లక్షలు అదనం..
గ్రీన్‌హౌస్‌ నిర్మాణానికి ఉపయోగిం చే షీట్‌ సహా ఇతరత్రా ఐరన్‌ సామగ్రి ఖర్చు జీఎస్టీతో 12 శాతంపెరిగింది. గతంలో చదరపు మీటర్‌ గ్రీన్‌హౌస్‌ నిర్మాణానికి రూ.840 ఖర్చు కాగా, ఇప్పుడది రూ.1,300 కానుంది. అంటే ఎకరానికి గతంలో రూ. 34 లక్షలు ఖర్చయితే, జీఎస్టీతో ఏకంగా రూ.52 లక్షలు ఖర్చుకానుంది. దీంతో ఎకరానికి రూ.18 లక్షల అదనపు భారం పడనుంది. ఇది రైతులపై పెనుభారం మోపనుంది. జీఎస్టీతో పెరిగే గ్రీన్‌హౌస్‌ నిర్మాణ భారాన్ని ప్రభుత్వం మోస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది.  

Advertisement
Advertisement