హైదరాబైక్ | Sakshi
Sakshi News home page

హైదరాబైక్

Published Sat, Oct 31 2015 12:29 AM

హైదరాబైక్ - Sakshi

సిటీ మీద ఇష్టం ఉన్న కవులైతే దాని మీద పాటలు రాస్తారు. గాయకులైతే పాటలు పాడతారు. ఫొటోగ్రాఫర్లయితే సిటీ గొప్పతనాన్ని తెలిపే ఫొటోలు తీస్తారు... మరి బైక్ ప్రియులైతే ఏం చేస్తారు? సిటీ చుట్టూ బైక్ వేసుకుని రౌండ్లు కొడతారు అని సమాధానం చెబితే మీరు టైర్ కింద కాలేసినట్టే. బైక్‌నే హైదరాబాద్‌గా మార్చేస్తారు. అదెలా అంటే ఇలా అని చేసి చూపించారు శ్యామ్‌కుమార్.            
 - ఎస్.సత్యబాబు
 
నగరంలో గత కొంతకాలంగా నివసిస్తున్న శ్యామ్‌కుమార్... బైక్ ప్రియుడు. ఇటీవలే హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నారు. వల్లమాలిన బైక్ ప్రియత్వంతో పాటు నగర ప్రియత్వం కూడా ఉన్న శ్యామ్‌కుమార్... తన మోటార్ సైకిల్.. సిటీ మీద తనకున్న ఇష్టానికి సింబల్‌లా ఉండాలని ఆశించారు. దీని కోసం సీట్ నుంచి టైర్ల వరకు సిటీతో నింపేయాలనుకున్నారు. అయితే బైక్ అందం చెడకుండా, హైదరాబాద్‌ను దానిపై చిత్రించాలని కోరుకున్నారు. ఈ పనిలో ఆయనకు మాదాపూర్‌లోని ఈస్ట్ ఇండియా మోటార్ సైకిల్ రెవల్యూషన్ కంపెనీ సహకరించింది. కొన్ని రోజుల ఆలోచనలు, ప్లానింగ్ తర్వాత హార్లీ డేవిడ్సన్ కాస్తా హైదరాబాద్ రిఫ్లెక్షన్ అయింది.
 
షహర్ హమారా.. బైక్ హమారా..
 ఇప్పుడు నగర వీధుల్లో పరుగులు తీస్తున్న శ్యామ్‌కుమార్ బైక్‌ను చూస్తే హైదరాబాద్‌ను షార్ట్‌కట్‌లో చూసినట్టే. చరిత్ర చెప్పే చార్మినార్ నుంచి చవులూరించే బిర్యానీ దాకా, సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం నుంచి గోల్కొండ కోట వరకు, మొన్నటి దర్పానికి చిహ్నమైన కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి నేటి మోడ్రన్ సిటీని చూపించే సైబర్ టవర్స్ దాకా... తన బైక్‌పై కొలువుదీర్చారు. మక్కా మసీదు, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌లతో పాటు రిక్షాలూ, ముత్యాలూ ఇలా హైదరాబాద్‌ను అన్ని విధాలుగా బైక్‌పై ప్రతిష్టించిన శ్యామ్‌కుమార్... హార్లీ డేవిడ్సన్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని కూడా చూపించారు. ఈ కంపెనీ బైక్‌లు ఇండియాలోకి రావడానికి 2007లో అనుమతి లభించింది. మ్యాంగోస్ తమకు ఇవ్వడానికి ఇండియా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతగా అమెరికా భారత్‌కు హార్లీని ఇచ్చింది. ఈ కారణంగా దీనికి మ్యాంగో డిప్లొమసీ అనే పేరొచ్చింది. దీన్ని కూడా బైక్‌పై చిత్రింపజేశారు శ్యామ్.

Advertisement
Advertisement