99 అడుగుల ఆంజనేయుడు | Sakshi
Sakshi News home page

99 అడుగుల ఆంజనేయుడు

Published Fri, Dec 19 2014 3:17 PM

99 అడుగుల ఆంజనేయుడు

తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహంగా రికార్డు

మియాపూర్ ప్రశాంత్‌నగర్‌లోని శ్రీ సీతారామంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో 99 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ర్టంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహంగా చెప్పుకుంటున్న ఈ విగ్రహాన్ని పూర్తిగా భక్తుల విరాళాలతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దాసరి గోపీకృష్ణ, కార్యదర్శి పూర్ణచందర్‌రావులు విగ్రహ నిర్మాణం గురించి పలు వివరాలను వెల్లడించారు. ఈ భారీ విగ్రహం వల్ల స్థానిక ప్రాంతంలో దుష్టశక్తులు, అశాంతి పటాపంచలైపోతాయని వేదపండితులు పేర్కొన్నారు.
 
ఆంజనేయుడు అంటే అచంచలమైన భక్తితత్వానికి, పరాక్రమానికీ, ధైర్య సాహసాలకు ప్రతీక అని, దుష్టశక్తులపాలిట యముడి లాంటివాడని ధార్మికవేత్తలు చెప్పారు. కాగా ఈ భారీ హనుమంతుడు మియాపూర్ మొత్తానికి రక్షకుడిగా, దేవాలయ క్షేత్రపాలకుడిగా విలసిల్లుతాడని ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల రాజగోపాలాచార్యులు తెలిపారు. కాగా ఈ భారీ హనుమంతుడి విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీరామమూర్తి అనే శిల్ప కళాకారుడు తన శిష్య బృందంతో కలిసి నిర్మిస్తున్నాడు. ఇంతవరకూ తెలంగాణ లో 75 అడుగులకు మించిన భారీ విగ్రహం లేదన్నారు. ప్రస్తుతం యాదగిరిగుట్టలోని ఆంజనేయుడి విగ్రహమే అతిపెద్దదని ప్రధాన అర్చకులు రాజగోపాలాచార్యులు తెలిపారు.

Advertisement
Advertisement