తెలంగాణపై బాబు దాదాగిరేంది? | Sakshi
Sakshi News home page

తెలంగాణపై బాబు దాదాగిరేంది?

Published Fri, Aug 1 2014 2:26 AM

తెలంగాణపై బాబు దాదాగిరేంది? - Sakshi

 ఏపీ కుట్రలో తెలంగాణ సర్కార్ పావు కాబోదు

* గిల్లికజ్జాలు పెట్టుకోవడానికే ఏపీ సీఎం యావ  
* వారిపిల్లలకూ మేమే ఫీజులు కట్టాలట !
* ఏకపక్షంగా జారీ చేస్తే ఎంసెట్ నోటిఫికేషన్ చెల్లుబాటవుతుందా ?
* మంత్రి హరీశ్‌రావు ధ్వజం

 
సాక్షి, హైదరాబాద్: పొద్దున లేస్తే తెలంగాణ ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలి. తెలంగాణ ప్రభుత్వంతో ఎలా గిల్లికజ్జాలు పెట్టుకోవాలన్న విషయాలపైనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టంతా కేంద్రీకృతమై ఉందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విద్యార్థులకూ ఫీజులు కట్టాలని చంద్రబాబు దాదాగిరి  చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లతో కలసి గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
 
‘తెలంగాణకు గట్టినాయకుడు సీఎంగా ఉన్నాడు. మా సీఎంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్రలో తెలంగాణ ప్రభుత్వం పావు కాబోదు’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.  ఏ రాష్ట్ర పిల్లలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసుకోవడం ఆనవాయితీ అన్నారు. తెలంగాణ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే, పక్క రాష్ట్ర విద్యార్థుల ఫీజులూ కట్టాలని చంద్రబాబు అడగడం సమంజసం కాదన్నారు. బహుషా దేశంలోని ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి ఇలా మరో రాష్ట్రాన్ని అడిగి ఉండరన్నారు.
 
ఎవరూ అడగని విధంగా చంద్రబాబు మా పిల్లలకు మీరే ఫీజులు కట్టండని దాదాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికి సాయం చేయాలి. ఎవరు ఏ రాష్ట్ర పిల్లలు అని తెలుసుకునే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయని  ఆయన అన్నారు. స్థానికతను గుర్తించే హక్కు రాష్ట్రాలకు ఉంటదని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, జోషి అనే వ్యక్తి మధ్య నడిచిన కేసులో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1950 కంటే ముందు నివాసం ఉన్న కుటుంబాలను స్థానికులుగా గుర్తిస్తూ ఐటీడీఏ ఉద్యోగాల భర్తీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం 2000 జనవరి 16న జీవో జారీ చేసిందన్నారు.
 
విద్యార్థుల స్థానికతను గుర్తించేందుకు కొంత సమయం పడుతుందని హరీశ్‌రావు తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కొన్ని బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏరివేస్తామన్నారు. ఈ రెండు అంశాలు తేలిన తర్వాతే ఎంసెట్ ప్రవేశాలు జరుపుతామన్నారు. ఎంసెట్ ద్వారా ఉమ్మడి ప్రవేశాలు జరపాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నా పట్టించుకోకుండా, ఏకపక్షంగా నోటిఫికేషన్ జారీ చేస్తే ఎలా అని ఆయన నిలదీశారు. అసలు కాలేజీల లిస్టు ఇవ్వలేదని జేఎన్‌టీయూ వీసీ చెప్పారన్నారు. నిజానికి ఏటా ఎంసెట్ ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతాయన్నారు.

Advertisement
Advertisement