ప్రధాని దృష్టికి సాగు సంక్షోభం | Sakshi
Sakshi News home page

ప్రధాని దృష్టికి సాగు సంక్షోభం

Published Wed, Dec 30 2015 12:50 AM

ప్రధాని దృష్టికి సాగు సంక్షోభం - Sakshi

♦ వచ్చే నెల గాంగ్‌టక్‌లో వ్యవసాయ మంత్రుల సమావేశం
♦ ప్రధాని మోదీ హాజరు... రాష్ట్రం నుంచి పోచారం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ సమక్షంలో నే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, కరువు, రైతు ఆత్మహత్యలపై సమగ్రంగా చర్చించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ యోచిస్తోంది. వచ్చే నెల సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శుల ప్రత్యేక సమావేశం జరగనుంది. దీనికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యకార్యదర్శి పార్థసారధి హాజరుకానున్నారు. కీలకమైన ఈ సమావేశానికి ప్రధాని ముఖ్యఅతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల వ్యవసాయ మం త్రుల అభిప్రాయాలను ఆయన వినే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో సమస్యలను ప్రధాని దృష్టికి తెచ్చి, రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన అవసరాన్ని మంత్రి పోచారం విన్నవించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌హౌస్, ఉద్యాన పంటల సాగు, బిందు సేద్యంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడం వంటి వాటికి సాయాన్ని కోరనున్నట్లు తెలిసింది. కరువు సాయాన్ని కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. స్వయంగా ప్రధానమంత్రే వస్తున్నందున వీలైనన్ని ఎక్కువ అంశాలను ప్రస్తావిస్తామని వ్యవసాయశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని నిర్ణయించారు.

 విత్తన భాండాగారానికి సహకారం: కరువుతో అప్పుల భారం పెరిగి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం విత్తన భాండాగారం వైపు అడుగులు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశంలోనే రాష్ట్రాన్ని విత్తన రాజధానిగా, ప్రపంచంలోనే విత్తన హబ్‌గా తయారుచేయడానికి కేంద్రం సహకరించాలని వ్యవసాయ మంత్రుల సమావేశంలో కోరనున్నారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారం పెంపొందించేందుకు కేంద్రం విత్తన ఎగుమతి సంబంధించిన విదేశీ వాణిజ్య అంశాలను పరిష్కరించాలని విన్నవించనున్నారు. విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement