అవినీతి ఆరోపణలను నిరూపించాలి | Sakshi
Sakshi News home page

అవినీతి ఆరోపణలను నిరూపించాలి

Published Sun, Jul 3 2016 12:45 AM

అవినీతి ఆరోపణలను నిరూపించాలి - Sakshi

కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన ఎంపీ బాల్క సుమన్
 
 సాక్షి, హైదరాబాద్: ‘అవినీతి జరిగిందంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా.. ఏ ప్రాజెక్టులో అవినీతి జరిగిందో  ఆధారాలతో నిరూపించాలి. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసిన ప్రతిసారీ ఆధారాలు చూపాలని టీఆర్‌ఎస్ పక్షాన మేము కోరుతున్నాం. అయినా స్పందించకుండా, నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమే పనిగా పెట్టుకున్నారు..’ అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజుతో కలసి శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్, భట్టి వంటి కాంగ్రెస్ నేతలకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

గృహనిర్మాణ శాఖ మంత్రిగా పేదల కడుపులు కొట్టి జేబులు నింపుకొన్న ఉత్తమ్ అవినీతి బాగోతం, భట్టి ‘రియల్’ దందాలు, భూ కబ్జాలు మరిచిపోవద్దన్నారు. తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టి హింసించి రాక్షసానందం పొందడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచారనడం కాంగ్రెస్ నేతల అవివేకమని, 2007 నాటి అంచనా విలువను 2016 రేట్లతో సవరించారని తెలి పారు. హైకోర్టు విభజనకు గల్లీ నాయుడు చంద్రబాబు, ఢిల్లీ నాయుడు వె ంకయ్య అడ్డుగా ఉన్నారని సుమన్ ఆరోపించారు.

 ఎవరడ్డుపడినా ప్రాజెక్టులాగవు: గువ్వల
 అవినీతిమయమైన కాంగ్రెస్, తెలంగాణలో అంతరించి పోయిన టీడీపీ, మాటలే తప్ప చేతలు లేని బీజేపీ.. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులు ఆగవని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులపై డీకే అరుణ, నాగం జనార్దన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని, చెరో పదేళ్ల చొప్పున అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయించలేక పోయారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement