‘నీట్’పై తర్జనభర్జన | Sakshi
Sakshi News home page

‘నీట్’పై తర్జనభర్జన

Published Mon, May 2 2016 4:14 AM

‘నీట్’పై తర్జనభర్జన - Sakshi

నేడు న్యాయ, వైద్య నిపుణులతో వైద్య మంత్రి భేటీ
 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘నీట్’ ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కారు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఏం చేయాలో అర్థంగాక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఏంచేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి న్యాయ, వైద్య నిపుణులు సహా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకులు రమణి తదితరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ‘నీట్’పై ఈ సమావేశంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఇదే అంశంపై తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో వారేం నిర్ణయం తీసుకుంటారోనని తెలంగాణ ఎదురుచూస్తోంది. అవసరమైతే రెండు రాష్ట్రాలు కలసి సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే యోచన కూడా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్‌లో సంభాషించారు. నీట్‌పై ఉమ్మడిగా అప్పీలుకు వెళ్లే అంశం వారిద్దరి చర్చల్లో వచ్చింది. నీట్‌పై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నందున ఆ రాష్ట్రాలతోనూ చర్చించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.

 తెలుగులో పరీక్షపైనా..
 నీట్ నుంచి ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరిస్తే అందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నీట్ తప్పనిసరైతే ఏం చేయాలో కూడా నిర్ణయం తీసుకోనుంది. అలాగే స్థానిక భాషలో ప్రశ్నపత్రం ఉండేలా కేంద్రాన్ని కోరాలని  భావిస్తోంది. పైగా సీబీఎస్‌ఈ సిలబస్ ప్రకారం నీట్ పరీక్ష ఉంటుందని చెబుతున్నందున దాన్ని ఎలా ఎదుర్కోవాలో సర్కారు ఆలోచన చేస్తోంది.

ఇదిలావుంటే నీట్‌పై స్పష్టత రాకపోవడంతో మెడికల్ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీ కేటగిరీ మెడికల్ సీట్లను అమ్మేసుకున్న ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నీట్ పరీక్ష తప్పనిసరైతే ఏం చేయాలోనని మదనపడుతున్నారు. సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ఇష్టారాజ్యంగా ఏమైనా చేసుకోవచ్చనే దానికి నీట్ పరీక్ష చెక్ పెడుతుందని.. అమ్మేసుకున్న సీట్లను ఏం చేయాలో అర్థం కావడం లేదని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ యజమాని పేర్కొన్నట్టు తెలిసింది.

బీ కేటగిరీ సీట్లకు డబ్బులు చెల్లించి సీటు రిజర్వు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా నీట్ పరీక్ష తప్పనిసరైతే తమ డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. ఇదిలావుంటే ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండే 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను కూడా నీట్ ర్యాంకు ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సీట్లు ఇప్పటికే భర్తీ అయిపోయాయి. తల్లిదండ్రులు రూ. కోట్లు చెల్లించి వాటిని కొనేశారు. దీంతో రూ. కోట్లు పెట్టిన తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement