Sakshi News home page

హై అలర్ట్

Published Tue, Apr 7 2015 11:21 PM

High alert

వికార్‌గ్యాంగ్ ఎన్‌కౌంటర్
మృతుల కుటుంబాల్లో విషాదం
ఉగ్ర భుజంగాల చేతిలో
నేలకొరిగిన ఎస్‌ఐ సిద్ధయ్యకు ఘన నివాళి

 
ఓ వైపు ఉగ్రవాదుల తూటాలకు బలై... మృత్యువుతో పోరాడుతూ అశువులు బాసిన ఎస్.ఐ...మరోవైపు వికార్ గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యుల ఎన్ కౌంటర్... ఈ రెండు సంఘటనలు మహా నగరాన్ని కుదిపేశాయి. కలవరం సృష్టించాయి. నగరానికి చెందిన వికార్ గ్యాంగ్ సభ్యులు ఐదుగురు మంగళవారం వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు-పెంబర్తిల మధ్య పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారన్న సమాచారం చర్చనీయాంశమైంది. జీవిత చరమాంకంలో తమకు తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు.. ఆయుధాలు పట్టుకొని... అర్థాంతరంగా తనువు చాలించిన వైనాన్ని మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరోవైపు సిమి ఉగ్ర భుజంగాలతో వీరోచితంగా పోరాడి నేలకొరిగిన యువ పోలీసు అధికారి సిద్ధయ్య కామినేని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ.. సాయంత్రం 4.06 గంటలకు తుది శ్వాస విడిచారన్న వార్త అందరినీ కలచివేసింది. ఆయన వీరోచిత పోరాటానికి గ్రేటర్ సిటీజనులు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేసి.. ఘనంగా నివాళులర్పించారు. పోలీసు కుటుంబాలతో పాటు అన్ని వర్గాలు ఆయన పోరాట పటిమను గుర్తు చేసుకున్నాయి. సిద్దయ్య భార్య ధరణీష ఇదే ఆస్పత్రిలో పండంటి కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. భర్త కన్నుమూసేందుకు అరగంట ముందు మాత్రమే అతన్ని చూసే అవకాశం ఆమెకు దక్కింది. ఈ సంఘటన అందరినీ కంట తడిపెట్టించింది.   
 
నల్గొండ జిల్లా ఆలేరు- వరంగల్ జిల్లా పెంబర్తి మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌తో నగరం ఉలిక్కి పడింది. తెహరిక్-గల్భా-ఏ-ఇస్లాం (టీజీఐ) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు వికారుద్దీన్‌తో పాటు నలుగురు అనుచరులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో నలుగురు నగరానికి చెందిన వారు కాగా... ఒకరు గుజరాత్ వాసి. ఒకేసారి నలుగురు వ్యక్తులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం నగర చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

ముఖ్యంగా వికారుద్దీన్ ఉంటున్న మలక్‌పేట, సయ్యద్ అమ్జద్ నివశించే సంతోష్‌నగర్, డాక్టర్ హనీఫ్ నివాసం ఉండే ముషీరాబాద్, ఎమ్‌డీ జాకీర్ నివాసముండే వారాసిగూడలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గత అనుభవాల దృష్ట్యా పాతబస్తీలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుత పరిస్థితులపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. మృతుల అంత్యక్రియల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల అదనపు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను దింపాలని సూచించారు.

నిఘా వర్గాల ఉన్నతాధికారులు, సిబ్బ ంది అప్రమత్తమయ్యారు. డీసీపీలు డాక్టర్ రవీందర్, సత్యనారాయణ, కమలాసన్‌రెడ్డిలు మృతుల నివాసాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. ఎన్‌కౌంటర్  బూటకమని.. పోలీసులే కాల్చి చంపారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు మృతదేహాలను తాకబోమని భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. వికార్ ముఠాలోని మొత్తం సభ్యులు ఏడుగురు. వీరిలో వికార్, అమ్జద్, జకీర్, డాక్టర్ హనీఫ్, ఇజార్‌లు ఎన్‌కౌంటర్ లో మృతి చెందారు.

మరో ఇద్దరు అనుచరు లు మురాద్ నగర్‌కు చెందిన మహ్మద్ రియాజ్ ఖాన్ (28), ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సయ్య ద్ (23)లు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. 2007 నుంచి 2010 వరకు వికార్ ముఠా సాగించిన వరుస నేరాలతో నగర పోలీసులతో పాటు గుజరాత్ పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ముఠా 2010 జూలై 14న  పట్టుబడడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

భయం గుప్పెట్లో....

వికార్ గ్యాంగ్ మొత్తం జై లులో ఉండడంతో ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న పోలీసులకు ఎన్‌కౌంటర్‌తో మరోసారి సవాల్ ఎదురైనట్లయింది. మృతదేహాలు నగరానికి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత వారిపై  పడింది. మలక్‌పేట, సంతోష్‌నగర్, ముషీరాబాద్, వారాసిగూడ ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా సమస్యాత్మక ప్రాంతాలలో ముమ్మరంగా వాహన త నిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు, కరడుగట్టిన మతఛాందస వాదుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు.

మృతుల వివరాలు...

వికార్ అహ్మద్ అలియాస్ అలీఖాన్, ఫరీద్, బాబర్, యాసీన్, అమీర్‌రాజా, రిజ్వాన్ (32) తండ్రి పేరు మహ్మద్ అహ్మద్, నివాసం ఇంటి  నెంబర్ 13-9-329, ఓల్డ్ మలక్‌పేట సయ్యద్ అమ్జద్ అలీ అలియాస్ సులేమాన్ , అబ్దుల్ వాజిద్, షరీఫ్ (25). తండ్రి పేరు సయ్యద్ అశ్రఫ్‌అలీ ఇంటినెంబర్ 18-8-223/13  సంతోష్‌నగర్, రియాసత్‌నగర్.ఆటో డ్రైవర్ మహ్మద్ జకీర్ (34). తండ్రి పేరు మహ్మద్ వజీర్. ఇంటి నెంబర్ 12-11-1643 వారాసిగూడ, అంబర్‌నగర్.

ఆర్‌ఎంపీ డాక్టర్ మహ్మద్ హనీఫ్ (36). అహ్మదాబాద్‌లోని బాపూ నగర్ వాసి (గుజరాత్). ప్రస్తుతం ఇంటి నెంబర్ 1-6-396, ముషీరాబాద్. ఇజార్ ఖాన్ (31). తండ్రి పేరు శంషోద్దీన్. నివాసం అహ్మద్‌ఖాన్, ఉత్తరప్రదేశ్ (లక్నో).

కోర్టుకు హాజరై..

2010 మే 14న శాలిబండ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో కడపకు చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతి చెందాడు. ఈ కేసు విచారణ నిమిత్తం సోమవారం నాంపల్లి కోర్టులో వికార్ గ్యాంగ్ హాజరైంది. అదే రోజు రాత్రి పోలీసులు వారిని తిరిగి వరంగల్ జైలుకు తరలించారు. మంగళవారం కూడా ఇదే కేసులో నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసు ఎస్కార్ట్‌తో వస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది. ఇదిలా ఉండగా... తనకు ప్రాణ హాని ఉందని,  కేసు విచారణ పూర్తయ్యేంత వరకు నగరం నుంచి మార్చవద్దని సోమవారం మెజిస్ట్రేట్‌కు వికార్ పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై మంగళవారం నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇంతలోనే ఎన్‌కౌంటర్ జరిగింది.
 
ఈ రోజు పండుగే

వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌లో హతమైన రోజు మాకు పండుగే. 2009 మే 18న ఫలక్‌నుమా నాగులచింత పోలీసు చెక్‌పోస్టులో డ్యూటీలో ఉన్న నాతో పాటు హోంగార్డు బాలస్వామిపై వికార్ కాల్పులకు పాల్పడ్డాడు. బాలస్వామి మృతిచెందగా..నేను గాయపడ్డాను. ఇప్పటికీ తూటా నా తలలోనే ఉంది. ఆ సంఘటన తలచుకోని రోజు లేదు. ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను. వికార్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడనే వార్త వినగానే మా కుటుంబం సంతోష పడింది.   - రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్  
 
ఎన్‌కౌంటర్ అన్యాయం


వికార్ గ్యాంగ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం అన్యాయమని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగు రీతిలో స్పందిస్తామని తెలిపారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అహ్మద్ బలాల వెంట ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
 - ఎమ్మెల్యే అహ్మద్ బలాల
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement