టీఎస్‌సెట్‌ ఫలితాలకు హైకోర్టు బ్రేక్‌! | Sakshi
Sakshi News home page

టీఎస్‌సెట్‌ ఫలితాలకు హైకోర్టు బ్రేక్‌!

Published Sat, Jul 8 2017 2:58 AM

టీఎస్‌సెట్‌ ఫలితాలకు హైకోర్టు బ్రేక్‌!

తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వెల్లడించవద్దని ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్ల భర్తీ, పదోన్నతుల నిమిత్తం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష 2017 (టీఎస్‌ సెట్‌) ఫలితాల వెల్లడికి ఉమ్మడి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు టీఎస్‌సెట్‌–2017 ఫలితాలను వెల్లడించొద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికా రులను ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి, యూజీసీ కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఓయూ రిజిస్ట్రార్, టీఎస్‌సెట్‌ సభ్య కార్యదర్శులకు నోటీసులిచ్చింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భర్తీ, పదోన్నతుల నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధివిధానాలను పరీక్ష తర్వాత మార్చేయడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆట మొదలైన తర్వాత ఆట నిబంధనలను మార్చేయడమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానిం చారు. టీఎస్‌సెట్‌ నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన నోటిఫికేషన్‌లోని విధివిధానాలను పరీక్ష పూర్తయిన తర్వాత మార్చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ రీసర్చ్‌ స్కాలర్‌ ఏల్చల దత్తాత్రీ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రామచంద్రరావు విచారణ జరిపారు. 
 
పరీక్ష తర్వాత విధివిధానాలు మార్చేశారు... 
ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది బూర రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ఫిబ్రవరి 16న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పోస్టుల భర్తీ, పదోన్నతుల విషయంలో విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారని, దీని ప్రకారం గత నెల 11న పరీక్ష నిర్వహించారని తెలిపారు. పరీక్ష పూర్తయిన తర్వాత, ఫలితాలను విడుదలకు అంతా సిద్ధమైన నేపథ్యంలో అధికారులు విధివిధానాలను మార్చేశారన్నారు. నోటిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన విధి విధానాల ప్రకారం మెరిట్‌ జాబితా నుంచి 15 మంది అభ్యర్థులను (ఒక్కో సబ్జెక్ట్, ఒక్కో కేటగిరీ) టీఎస్‌ సెట్‌లో అర్హత సాధించినట్లు ప్రకటిస్తారని పేర్కొన్నారని తెలిపారు. మార్చిన విధానం ప్రకారం 6 శాతం అభ్యర్థులనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తామన్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ టీఎస్‌ సెట్‌–2017 ఫలితాలను వెల్లడించవద్దని ఓయూ అధికారులను ఆదేశించారు. 

Advertisement
Advertisement