ఫుట్‌పాత్ ఆక్రమణదారులపై హైకోర్టు కన్నెర్ర | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్ ఆక్రమణదారులపై హైకోర్టు కన్నెర్ర

Published Wed, Nov 23 2016 12:21 AM

High court fires on Footpath aggression people

సిద్ధిఅంబర్ బజార్‌లో 106 షాపులను 3 రోజుల్లో సీజ్ చేయాలని గ్రేటర్ అధికారులకు ఆదేశం  
 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్ధిఅంబర్ బజార్‌లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించబోమంటూ హామీ ఇచ్చి ఉల్లంఘించిన షాపు యజమానులపై హైకోర్టు కన్నెరజ్రేసింది. హామీని ఉల్లంఘించిన 106 షాపులను తక్షణమే మూసేసి సీల్ వేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. ఇందుకు అవసరమైతే పోలీసుల సాయాన్ని కూడా తీసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాల అమలు నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌లోని సిద్ధిఅంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మినివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి స్పందిస్తూ ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వారి వివరాలతో నివేదికను కోర్టు ముందుంచారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించబోమంటూ గతంలో 153 మంది షాపుల యజమానులు హామీ ఇచ్చారని, అందులో 106 మంది ఆ హామీని ఉల్లంఘించారని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించడం కోర్టు ధిక్కారమే అవుతుందని స్పష్టం చేసింది. మరోసారి ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చునని షాపు యజమానులే చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. హామీని ఉల్లంఘించిన 106 షాపులకు తక్షణమే సీల్ వేయాలని, ఈ ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

Advertisement
Advertisement