కోర్టుకొస్తే కొడతారా? | Sakshi
Sakshi News home page

కోర్టుకొస్తే కొడతారా?

Published Wed, Mar 7 2018 2:30 AM

High court on foot paths occupation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్ర రాజధానిలోని మహబూబ్‌గంజ్, సిద్దిఅంబర్‌ బజార్‌ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించాలని పిల్‌ దాఖలు చేసిన పిటిషనర్‌పై దాడి చేస్తారా? ఇందుకు అఫ్జల్‌గంజ్‌ పోలీసులు వ్యక్తిగత బాధ్యత వహించాలి. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించకపోగా, కోర్టుకు వచ్చిన వారికి కూడా రక్షణ కల్పించలేరా?’అని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌లు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారు తనపై దాడి చేశారని పిటిషనర్‌ లక్ష్మీ నివాస్‌ అగర్వాల్‌ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో దాడి చేసిన వారిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిటిషనర్‌కు రక్షణ కల్పించకుండా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇందుకు అఫ్జల్‌గంజ్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) వ్యక్తిగతంగా బాధ్యులవుతారని పేర్కొంది. దాడి ఘటనపై అన్ని వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరుపుతామని వెల్లడించింది.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించింది. కాగా, హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బీఆర్‌ శాంత రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్లే జనమంతా రోడ్లపై నడవాల్సిన దుస్థితి ఏర్పడిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పట్టణ ప్రణాళిక శాఖ డైరెక్టర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement