కాలేజీలలో తనిఖీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ | Sakshi
Sakshi News home page

కాలేజీలలో తనిఖీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Published Fri, Apr 29 2016 2:14 PM

high court gives nod to telangana government over checks in colleges

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలలో తనిఖీలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాలేజీలలో విద్యాప్రమాణాలు సరిగా లేవన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కారు విజిలెన్స్ దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను వెంటనే ఆపాలంటూ జూనియర్ కళాశాలల జేఏసీ నిరసన వ్యక్తం చేయడంతో పాటు మే 1, 2 తేదీలలో జరిగే టెట్, ఎంసెట్‌లను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీంతో ఆ రెండు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

కొన్ని కాలేజీల తరఫున ఈ అంశంపై  హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు సింగిల్ బెంచి జూనియర్ కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచిలో అప్పీలు చేసింది. చాలావరకు కాలేజీలలో విద్యాప్రమాణాలు సరిగా లేవని, కనీసం వాటిలో ల్యాబ్‌లు ఉండటం లేదని, తగినంత మంది క్వాలిఫైడ్ అధ్యాపకులు కూడా లేరని.. చదువులో నాణ్యత బాగుండాలంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి దృష్టి పెట్టాలని ప్రభుత్వ వాదించింది. దాంతో దాడులు కొనసాగించుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement