ధనవంతులకేనా ఉచిత న్యాయ సేవలు! | Sakshi
Sakshi News home page

ధనవంతులకేనా ఉచిత న్యాయ సేవలు!

Published Sat, Dec 31 2016 3:33 AM

ధనవంతులకేనా ఉచిత న్యాయ సేవలు! - Sakshi

హైకోర్టు ఆక్షేపణ
న్యాయ సేవాధికార సంస్థ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
ఏపీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థలకు కోర్టు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌:
సమాజంలో న్యాయ సహాయం పొందే స్తోమత లేని వారి కోసం ఉద్దేశించిన ‘ఉచిత న్యాయ సేవలను.. కోర్టు ఫీజు మినహాయింపులను’ కొందరు డబ్బున్న వ్యక్తులు ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేస్తుండ డంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కోర్టు ఫీజు మినహాయింపు కావాలని ఎవరైనా కోరినప్పుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఆ వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల గురించి లోతుగా విచారణ చేపట్టడం లేదని ఆక్షేపించింది. విచారణ జరపకుండానే.. కోర్టు ఫీజు మినహా యింపునకు అర్హులని తేలుస్తుండటాన్ని తప్పుç ³ట్టింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని తెలిపింది. కొందరు బడాబాబులు తమకు ఆర్థిక స్తోమత లేదంటూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, కోర్టు ఫీజు మినహాయింపులు పొందుతూ, మరోపక్క భారీ ఫీజులు ఇచ్చి ప్రైవేట్‌ న్యాయవాదుల సేవలను ఉపయోగించుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కోర్టు పేర్కొంది.

ఆధారాలు లేకున్నా ఫీజు మినహాయింపా?
విశాఖపట్నం చినవాల్తేరులోని ఓ ఆస్తి వివాదం జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చేరింది. తమకు కోర్టు ఫీజు చెల్లించేంత స్తోమత లేదని, అందువల్ల తమకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఇవ్వాలంటూ ఆ ఆస్తితో సంబంధం ఉన్న 20 మంది సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకు న్నారు. ఇందుకు వారు తహసీల్దార్‌ ఇచ్చిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేశారు. 20 మంది తమ వార్షిక ఆదాయం రూ.72 వేలుగా పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987 ప్రకారం వార్షిక ఆదాయం నామమాత్రంగా ఉన్న వారు కోర్టు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందవచ్చు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి రూ.18.59 లక్షల కోర్టు ఫీజు మినహాయింపునిస్తూ ఫిబ్రవరిలో సర్టిఫికేట్‌ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆస్తి వివాదం ఎదుర్కొంటున్న నవ్య ఇన్‌ఫ్రాకన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.  ధర్మాసనం ఇరుపక్షాల వాదన విని ఇటీవల తీర్పు వెలువరించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆ 20 మంది ఆర్థిక స్థితిగతులను తెలుసుకోలేదని పేర్కొంది. వీరంతా ఒకే కుటుం బానికి చెందిన వారైనప్పటికీ, అందరూ ఆదా యాన్ని రూ.72 వేలుగా పేర్కొనడం, దానిపై అధికారులు వివరణ కోరకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇచ్చిన ఫీజు మినహాయింçపును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.  

అప్రమత్తంగా ఉండాల్సిందే
పేదలు, అవసరమైన వారి కోసం తీసుకొచ్చిన చట్ట నిబంధనలు అర్హత లేని వారికి, అనవసరంగా వివాదాలు సృష్టించే వ్యక్తులకు వరంగా మారుతున్నాయని హైకోర్టు తెలిపింది. ఇకనైనా కోర్టు ఫీజు మినహాయింపులు ఇచ్చేటప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987లో ఉన్న లోపాలను సరిదిద్ది, చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల న్యాయ సేవాధికార సంస్థలకు సూచించింది. కోర్టు ఫీజు మినహాయింపులు పొందిన వారు న్యాయ సేవాధికార సంస్థకు చెందిన ప్యానల్‌ న్యాయవాదుల సేవలనే వినియోగించుకోవడాన్ని తప్పనిసరి  చేసే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement