అప్పీల్‌ పెండింగ్‌లో ఉంటే.. బెయిల్‌ పొందొచ్చు | Sakshi
Sakshi News home page

అప్పీల్‌ పెండింగ్‌లో ఉంటే.. బెయిల్‌ పొందొచ్చు

Published Fri, Nov 4 2016 1:26 AM

అప్పీల్‌ పెండింగ్‌లో ఉంటే.. బెయిల్‌ పొందొచ్చు - Sakshi

యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న వారి విషయంలో హైకోర్టు నిర్ణయం
ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని తిరగరాసిన ధర్మాసనం
హైకోర్టులో ‘అప్పీల్‌’ పెండింగ్‌లో ఉందన్న కారణంగా బెయిల్‌ నిరాకరించడం సరికాదు
ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకొని జైల్లో సత్ప్రవర్తనతో ఉన్న వారికి బెయిల్‌ ఇవ్వొచ్చు
బందిపోట్లు, కిడ్నాపర్లు వంటివారికి బెయిలివ్వద్దని నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌: క్రిమినల్‌ అప్పీళ్లలో బెయిల్‌ మంజూరుకు సంబంధించి ఇప్పటివరకు పాటిస్తూ వచ్చిన సంప్రదాయాన్ని ఉమ్మడి హైకోర్టు తిరగరాసింది. ఏదైనా నేరంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారు తమ క్రిమినల్‌ అప్పీల్‌ పెండింగ్‌లో ఉందన్న కారణంతో దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు ఇన్నాళ్లుగా తిరస్కరిస్తూ వచ్చింది. తాజాగా ఆ సంప్రదాయానికి స్వస్తిపలికింది. హత్యనేరం సహా ఏదైనా నేరంలో యావజ్జీవ శిక్షపడి, ఐదేళ్ల శిక్షను అనుభవించిన ముద్దాయిలు.. ఆ శిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసుకున్న అప్పీల్‌ పెండింగ్‌లో ఉంటే బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారు జైల్లో సత్ప్రవర్తనతోనే ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్లు ధ్రువీకరించాలని స్పష్టం చేసింది. బందిపోట్లు, రకరకాల ప్రయోజనాల కోసం హత్యలకు పాల్పడినవారు, కిడ్నాపర్లు, ప్రజాసేవకుల హంతకులు, జాతీయ భద్రతా చట్టం పరిధిలోని నేరాలు చేసిన వారు, నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేసులో శిక్షపడినవారికి మాత్రం బెయిల్‌పై విడుదలయ్యేందుకు అర్హత లేదని తేల్చి చెప్పింది.

రెండు షరతులు..
ఇలా బెయిల్‌ మంజూరు చేసే సమయంలో ప్రధానంగా రెండు షరతులు విధించాలని హైకోర్టు నిర్ణయించింది. ఒకటి బెయిల్‌ పొందిన తరువాత క్రిమినల్‌ అప్పీల్‌ విచారణ సమయంలో తప్పనిసరిగా కోర్టు ముందు హాజరుకావాలని, రెండోది బెయిల్‌పై ఉన్నంతకాలం నెలకోసారి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో రిపోర్ట్‌ చేయాలని పేర్కొంది. ఇక బెయిల్‌ ఇవ్వడం, ఇవ్వకపోవడమన్నది ఆ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను బట్టి సంబంధిత ధర్మాసనం విచక్షణపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. హత్యానేరం కింద యావజ్జీవశిక్ష అనుభవిస్తూ కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో 2011లో అప్పీల్‌ చేసిన బచ్చు రంగారావు, మరో ఎనిమిది మందికి షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

ఆలస్యమవుతోంది.. బెయిల్‌ ఇవ్వండి
మారణాయులతో కొట్లాటలకు దిగి హత్య చేసినందుకు బచ్చు రంగారావు, బచ్చు గోపాలకృష్ణ, వల్లభదాసు రమేశ్‌ తదితరులపై గుంటూరు జిల్లా భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దానిపై విచారణ జరిపిన తెనాలి 11వ అదనపు సెషన్స్‌ జడ్జి 2011 ఏప్రిల్‌ 15న వారందరికీ యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ వారు అదే ఏడాది జూన్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచీ ఆ అప్పీల్‌ పెండింగ్‌లోనే ఉంది. అయితే అప్పీల్‌ పెండింగ్‌లో ఉన్న ముద్దాయిలు దాఖలు చేసే బెయిల్‌ పిటిషన్లను కొట్టివేయడాన్ని హైకోర్టు సంప్రదాయంగా పాటిస్తూ వస్తుండటంతో వారు బెయిల్‌ కోసం దరఖాస్తు చేయలేదు. ఈ నేపథ్యంలో వారు దాదాపు ఐదున్నరేళ్లుగా జైల్లో ఉన్నారు. ఇటీవల కశ్మీరాసింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుంటూ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2010లో దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున తమపై అప్పీల్‌పై విచారణ ఆలస్యమయ్యే అవకాశముందని, అందువల్ల తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

నిర్దిష్ట విధానం రూపొందించిన ధర్మాసనం
క్రిమినల్‌ అప్పీళ్లు దాఖలు చేసి కొన్ని సంవత్సరాల పాటు శిక్షను పూర్తి చేసుకున్న వారికి బెయిల్‌ మంజూరు చేసే విషయంలో అభిప్రాయం చెప్పాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ధర్మాసనం కోరింది. బెయిల్‌ మంజూరు అన్నది పూర్తిగా న్యాయస్థానాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని, అందులో ప్రభుత్వాలు చెప్పేందుకు ఏమీ ఉండదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, మరో న్యాయవాది సురేశ్‌రెడ్డిల సలహాలు కూడా కోరింది. వారు ఇచ్చిన సలహాలను, సుప్రీంకోర్టు తీర్పులను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... యావజ్జీవశిక్షపై అప్పీల్‌ దాఖలు చేసి, అవి పెండింగ్‌లో ఉండగానే శిక్ష అనుభవిస్తున్నవారికి బెయిల్‌ మంజూరుపై ఓ స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అప్పీల్‌ పెండింగ్‌లో ఉందన్న కారణంతో బెయిల్‌ తిరస్కరిస్తూ వస్తున్న సాంప్రదాయాన్ని తిరగరాసింది. ముద్దాయిల అప్పీల్‌ పెండింగ్‌లో ఉండి, కనీసం ఐదేళ్లుగా శిక్ష అనుభవించిన ముద్దాయిలు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ లెక్కన ప్రస్తుత కేసులో ముద్దాయిలు బెయిల్‌కు అర్హులని ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పడంతో... వారికి తీర్పులో నిర్దేశించిన షరతుల ప్రకారం బెయిల్‌ మంజూరు చేసింది.

తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్లే..
‘‘ఏదైనా కేసులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న వారిని వారి అప్పీల్‌ పెండింగ్‌లో ఉందన్న కారణంతో సుదీర్ఘకాలం పాటు జైల్లోనే ఉంచేయడం అన్యాయం. కశ్మీరాసింగ్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం.. ముద్దాయి అప్పీల్‌ను నిర్ణీత కాలంలోపు పరిష్కరిస్తామన్న ఉద్దేశంతో బెయిల్‌ నిరాకరించడాన్ని పలు హైకోర్టులు ఓ సంప్రదాయంగా పాటిస్తున్నాయి. అయితే అంతిమంగా ఆ ముద్దాయి నేరం చేయలేదని తేలితే.. ఆ వ్యక్తిని అప్పటివరకు జైల్లోనే ఉంచడమన్నది న్యాయ అవహేళన కిందకే వస్తుంది. అంతకాలం జైల్లో ఉంచడం వల్ల వారికి కలిగిన కష్టాన్ని, నష్టాన్ని పూరించడం ఏ కోర్టుకూ సాధ్యం కాదు. ఉమ్మడి హైకోర్టులో క్రిమినల్‌ అప్పీళ్లు సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉండడానికి కారణం తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడమే. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో క్రిమినల్‌ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగంలోని అధికరణ 21లో అంతర్భాగమని ఇప్పటికే పలు తీర్పుల ద్వారా న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అందువల్ల సత్ప్రవర్తన కలిగిన వారు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..’’
– జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement