గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్కు షాక్ | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్కు షాక్

Published Thu, Jan 7 2016 4:13 PM

గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్కు షాక్ - Sakshi

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల గడువును కుదిస్తు జారీ చేసిన జీవోను హైకోర్టు గురువారం కొట్టివేసింది. 15 రోజులకు కుదించాలన్న సర్కార్ నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీలోగా ఎన్నికల ప్ర్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా శనివారంలోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు వెల్లడించింది. విచారణ సందర్భంగా అధికారుల తీరును కోర్టు తప్పుబట్టింది. చట్టాన్ని సవరించే అధికారం శాసనసభకు తప్ప అధికారులు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా  ఆదివారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ జారీ తర్వాత 31 రోజుల సమయం కావాలని పేర్కొంది.

ఈ సందర్భంగా న్యాయవాది జంధ్యాల రవిశంకర్  మాట్లాడుతూ 'ఈ ప్రక్రియలో సెలవులను మినహాయించాల్సి ఉంటుంది. సెక్షన్ 33ని సవరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. శనివారంలోగా రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు చెప్పింది.  ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలుండాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ సదర్భంగా అందరి అభిప్రాయాలను కోర్టు మన్నించింది. శనివారం లేదా ఆదివారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది' అన్నారు.


హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ గడువును కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిథర్ రెడ్డి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన పోరాట ఫలితం అయినా...ఇది ప్రజాస్వామ విజయంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ కుట్ర చేసిన విజయవంతంగా అడ్డుకోగలిగామని అన్నారు.


హైకోర్టు తీర్పు టీఆర్ఎస్కు చెంపపెట్టు

కోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలంటే టీఆర్ఎస్కు గౌరవం లేదని, ఎక్స్ అఫీషియో మెంబర్లను పెంచడంపై హైకోర్టుకు వెళతామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement