ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు షాక్ | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు షాక్

Published Fri, May 20 2016 4:40 AM

ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు షాక్ - Sakshi

* నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండా ప్రవేశాలు చేసుకోవాలని
* మైనారిటీ డిగ్రీ కాలేజీలకు సూచన

సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు షాక్‌నిచ్చింది. ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించి దానిని పూర్తి చేసుకోవచ్చని మైనారిటీ డిగ్రీ కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు, కేటాయింపులు తదితర అంశాలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా ఈ నెల 16న ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, మరో 11 మైనారిటీ కాలేజీలు హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు విచారించారు. కాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం ఏకపక్షంగా ఆన్‌లైన్ ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో కాకుండా మిగిలిన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా పిటిషనర్లు ప్రవేశాల ప్రక్రియను చేపట్టవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement