సంక్షోభంలో ఉన్నత విద్య | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ఉన్నత విద్య

Published Sun, Jul 19 2015 3:44 AM

సంక్షోభంలో ఉన్నత విద్య

ప్రొఫెసర్ హరగోపాల్

సుందరయ్య విజ్ఞాన కేంద్రం : రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని ప్రొఫెసర్ హరగోపాల్  అన్నారు. 17 విశ్వ విద్యాలయాలకు వీసీలు, సిబ్బంది లేరని, ప్రభుత్వ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు లేక అస్తవ్యస్తంగా మారాయన్నారు. యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోందన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘డబ్ల్యూటీవో నుంచి ఉన్నత విద్యారంగం వైదొలగాలి’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

2005 నుంచి డబ్ల్యూటీవోలో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి విశ్వవిద్యాలయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 17 ఏళ్లుగా దేశంలో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకుల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రొఫెసర్ చక్రధర్‌రావు మాట్లాడుతూ.. డబ్ల్యూటీవో ప్రపంచ బ్యాంకు కంటే ప్రమాదకరమైనదని తెలిపారు.

డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ఏకం కావాలని సూచించారు. డబ్ల్యూటీవో నుంచి ఉన్నత విద్యా రంగం వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9నఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడలు ఎ.నర్సింహారెడ్డి, కె. రవిచందర్, ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణ, కొండల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement