గృహ నిర్మాణ పరిహారం కొలిక్కి! | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణ పరిహారం కొలిక్కి!

Published Wed, Apr 20 2016 12:38 AM

గృహ నిర్మాణ పరిహారం కొలిక్కి! - Sakshi

‘పాలమూరు-రంగారెడ్డి’
ఆర్‌అండ్‌బీ శాఖకు చేరిన ఫైలు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోత ల పథకంలో ముంపునకు గురౌతున్న గృహాలకు పరిహారం చెల్లింపు అంశం కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముంపు ప్రాంతాల్లో గృహాలపై రెవెన్యూ, ఆర్‌అండ్ బీ శాఖల సర్వేలు, విలువను మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లింపు విధానాన్ని పక్కనపెట్టి, కొత్తగా గృహ నిర్మాణ రకాన్ని బట్టి చదరపు అడుగును ప్రాతిపదికగా తీసుకొని సత్వరమే చెల్లింపులు చేసేలా నీటిపారుదల శాఖ వేసిన ప్రతిపాదనలకు ఇతర శాఖల నుంచి అంగీకారం వచ్చినట్లుగా సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ప్రజోపయోగ ప్రాజెక్టుల నిర్మాణంలో గృహాలు కోల్పోయేవారికి చెల్లించే పరిహారం విషయంలో ఆర్‌అండ్‌బీ కొత్త నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం గృహ నిర్మాణం ప్రాథమిక అంచనా మొత్తం రూ. 4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింథ్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తం రూ. 4 లక్షలకంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం లెక్క గడతారు.

 పాత విధానమైతే పనుల్లో జాప్యం: అయితే ఇక్కడ ఆర్‌అండ్‌బీ శాఖ నిబంధన మేరకు రూ.4 లక్షల కన్నా తక్కువగా ఉన్న నిర్మాణాలకు, ఎక్కువగా ఉండే నిర్మాణాలకు వేర్వేరు నిబంధనలు తెచ్చారు. ఈ విధానాన్ని పాలమూరు ప్రాజెక్టులో అమలు చేస్తే తీవ్ర జాప్యం జరుగుతుంద ంటూ నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. రూ. 4 లక్షల కన్నా ఎక్కువ ఉండే నిర్మాణాలను సంబంధిత శాఖలు కొలతలు లెక్కించి, తరుగుదల నిర్ధారించి, కలప రకాన్ని గుర్తించి ధరను నిర్ణయించడం మొదలు పెడితే ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంటుందని వివరించింది. ఈ ప్రతిపాదనలపై  ఆర్‌అండ్‌బీ అడ్డుచెప్పింది.  రూ. 4 లక్షల పైబడి ఉండే గృహాలకు నిర్మాణ వైశాల్యాల ఆధారంగా పరిహారం చెల్లించడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే దీనిపై శాఖల ముఖ్య కార్యదర్శుల స్థాయిలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో రూ. 4 లక్షల పైబడి ఉండే గృహాలకు ఫ్లింత్ ఏరియా ఆధారంగా పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమం అయింది. దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటికే ఆర్‌అండ్‌బీకి చేరినట్లుగా తెలిసింది. అక్కడినుంచి ప్రభుత్వానికి చేరిన వెంటనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement