బెజవాడ విమానానికి తప్పిన భారీ ముప్పు | Sakshi
Sakshi News home page

బెజవాడ విమానానికి తప్పిన భారీ ముప్పు

Published Tue, Aug 11 2015 5:12 PM

బెజవాడ విమానానికి తప్పిన భారీ ముప్పు - Sakshi

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే ఈ లోపం తలెత్తింది.

అయితే పైలట్ అప్రమత్తంగా ఉండటం, లోపాన్ని గుర్తించడంతో వెంటనే ఏటీసీని సంప్రదించి మళ్లీ కిందకు దించేశారు. ఈలోపు దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానంలో టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, మోదుగుల వేణుగోపాల రెడ్డిలతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఏఐ 544 నెంబరు గల ఈ విమానం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి టేకాఫ్ తీసుకుంది. తర్వాత పది నిమిషాల్లోనే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఏటీసీని సంప్రదించడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి రావడం.. ఇవన్నీ అయ్యేందుకు మరో 20 నిమిషాల సమయం పట్టింది. దాంతో 4.30 గంటలకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 81 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా పీఆర్వో చెప్పారు.

Advertisement
Advertisement