ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాజధాని | Sakshi
Sakshi News home page

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాజధాని

Published Tue, Sep 27 2016 2:55 AM

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాజధాని - Sakshi

- బండారీ లే అవుట్, ధరణీనగర్‌లలో వరద తగ్గుముఖం
 హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలమైన రాజధానిలో సోమవారం వర్షం తెరిపినీయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వర్షాలకు భారీగా దెబ్బతిన్న రహదారులకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగం అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నిజాంపేట్‌లోని బండారీ లే అవుట్, ధరణీనగర్‌లలో వరద తగ్గుముఖం పట్టింది. ఇంకా బండారీ లే అవుట్‌లోని 15 అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలో వరదనీరు నిలిచి ఉంది. పరిస్థితి అదుపులోనే ఉండడంతో సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వెనక్కి రప్పించారు. వరద బాధితులకు జీహెచ్‌ఎంసీ, స్థానిక పంచాయతీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారం, మంచినీరు అందజేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలు ఏర్పాటుచేసి అవసరమైన మందులను అందజేస్తోంది.
 
 వరద ముంపులో చిక్కుకున్న బేగంపేట్ నాలా పరీవాహక ప్రాంత ప్రజలు సోమవారం తేరుకున్నారు. రహదారులతో పాటు ఇళ్లలోకి చేరిన వరద నీరు కూడా తొలగిపోవడంతో బురదను తొలగించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. బేగంపేట్ అల్లంతోటబావి, మయూరిమార్గ్, ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్, బ్రాహ్మన్‌వాడీ, వడ్డెరబస్తీల్లో రోడ్లపై బురద మాత్రం అలాగే ఉంది. ముంపునకు గురైన బేగంపేట్‌లోని దేవనార్ అంధుల పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను ముందుగానే ప్రకటించి ఇళ్లకు పంపించినట్లు యాజమాన్యం తెలిపింది.  కాగా రాగల 24 గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
 
 సోమవారం ఉదయం వరకు వర్షపాతం ఇలా...
 కాగా సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉప్పల్‌లో 1.6 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 1.4, బహదూర్‌పురాలో 1.2, సరూర్‌నగర్‌లో 1.5, బాలానగర్‌లో ఒక సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.

Advertisement
Advertisement