గాలిపటం గాయబ్‌ | Sakshi
Sakshi News home page

గాలిపటం గాయబ్‌

Published Mon, Jan 16 2017 1:15 AM

గాలిపటం గాయబ్‌

భాగ్యనగరంలో తగ్గుతున్న పతంగుల సందడి
90 శాతం తగ్గిన విక్రయాలు..
సెల్‌ ప్రపంచంలో మునిగి చెరఖాను వదిలేస్తున్న యువత, చిన్నారులు
కొనుగోలుదారులు లేక బోసిపోతున్న గుల్జార్‌హౌస్‌


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది ఒక్క బిర్యానీనే కాదు పతంగులు కూడా! జనవరి వచ్చిందంటే చాలు.. పేంచ్‌.. డీల్‌ చోడ్‌.. లండోర్‌.. పేంచ్‌కాట్‌.. ఏ గల్లీలో చూసినా ఈ పదాలే వినిపించేవి. కానీ రోజులు  మారాయి. ఇప్పడు నింగిలో గాలిపటాల రెపరెపలు కనిపించటం లేదు. గతేడాది ఓ మోస్తరుగా కనిపించిన పతంగులు ఇప్పుడు నల్లపూసల య్యాయి. ఈసారి ఇప్పటిదాకా కేవలం పది శాతం పతంగులే అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనవరిలో భాగ్యనగరంలోని గుల్జార్‌హౌజ్‌ కిటకిటలాడుతూ ఉంటుంది. పాతనగరంలోని ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో దుకాణాలు గాలిపటాలను విక్రయిస్తాయి. యాకుత్‌పురా, డబీర్‌పురా, పత్తర్‌ఘట్టి, మదీనా, శాలిబండ, లాల్‌దర్వాజ, మహారాజ్‌గంజ్, గోషామహల్, దూల్‌పేట, చెత్తబజార్, చార్మినార్‌... ఈ ప్రాంతాల్లో అడుగడుగునా గాలిపటాల దుకాణాలు ముస్తాబవుతాయి. వాటి చుట్టూ వందల మంది కొనుగోలుదారులతో సందడి నెలకొంటుంది. అలాంటి గుల్జార్‌హౌజ్‌ ప్రాంతాలు ఇప్పుడు బోసిపోయాయి. కొనుగోలుదారులు కేవలం పదుల సంఖ్యలో కన్పిస్తున్నారు. సంక్రాంతి పండగ ముగిసినా ఇంకా దుకాణాల్లో పతంగుల బొత్తులు అలాగే ఉండిపోయాయి.

సెల్‌ చెరలో చెరకా
గతేడాది భాగ్యనగరంలో పతంగుల విక్రయాలు యాభై శాతం పడిపోయాయి. ఈ ఏడాదైతే మరీ దారుణంగా విక్రయాలు 90 శాతం మేర తగ్గిపోయాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అంతా ‘సెల్‌’ ప్రపంచంలో మునిగిపోయి చెరకా పట్టుకోవటం మానేశారు. ఈ మూడు రోజులు రద్దీగా ఉండాల్సిన మైదానాలు పూర్తిగా బోసిపోయాయి. అక్కడక్కడా కొన్ని గుంపులు కనిపించినా వారు క్రికెట్‌ ఆటకే పరిమితమయ్యారు. ఆ మూలా ఈ మూలా పది ఇరవై మంది గాలిపటాలు ఎగరేయడం కనిపించింది. వాట్సాప్‌ మెజేజ్‌లు, ఫేస్‌బుక్‌ లైక్‌లు.. చాటింగ్‌లు... ఈ హడావుడిలో గాలిపటం కొట్టుకుపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. పాతబస్తీలో చాలాప్రాంతాల్లో పతంగులు, మాంజా దారం తయారీ ఓ కుటీర పరిశ్రమ. వందల కుటుంబాలు సంవత్సరంలో నాలుగైదు నెలలు వాటి తయారీపైనే ఆధారపడేవి. ఇప్పుడు ఆ పరిశ్రమ ధ్వంసమైంది. గత నాలుగైదేళ్లుగా పతంగులకు ఆదరణ తగ్గటంతో వారు ప్రత్యామ్నాయంవైపు దృష్టి సారించారు.

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
‘‘మూడు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులు పిల్లలో వారానికి 30 గంటల నాణ్యమైన సమయాన్ని గడిపేవారట. ఇప్పుడది 18 నిమిషాలకు పడిపోయిందని విశ్లేషకులు తేల్చారు. సెల్‌ఫోన్‌ ధ్యాసను కాస్త పక్కన పెట్టి పిల్లలతో గడిపితే వారిలో మంచి మార్పు వస్తుంది. దానికి గాలిపటాలెగరేయటం మంచి వ్యాపకం. కాసేపు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిపి గాలిపటాలెగరేస్తే ఆ కుటుంబ మానసిక, శారీరక నడవడికలో మంచి మార్పు వస్తుంది. చివరకు అది మంచి ఫలితం వైపు తీసుకెళ్తుంది’’– డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి, మానసిక విశ్లేషకులు

ఒడిదుడుకులు తట్టుకునే శక్తి వస్తుంది
‘‘గాలిపటం ఎగురుతున్నప్పుడు కాసేపు పిల్లలను పట్టుకోమనండి. బరువుగా ఉండే ఆ గాలిపటం పడిపోకుండా పైకే ఎగిరేలా చేసినప్పుడు ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా పరిష్కారాలను వెదికే ఆలోచనశక్తి వారికి అబ్బుతుంది. వారిలో చైతన్యం నింపుతుంది’’    – వేదకుమార్, సామాజికవేత్త
 

Advertisement
Advertisement