హైదరాబాదీ బిర్యానీ.. ఫెయిలైంది! | Sakshi
Sakshi News home page

హైదరాబాదీ బిర్యానీ.. ఫెయిలైంది!

Published Thu, Mar 9 2017 11:57 AM

హైదరాబాదీ బిర్యానీ.. ఫెయిలైంది!

మన హైదరాబాదీ బిర్యానీ అంటే చాలు.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాలకు చెందినవాళ్లు, సినీ తారలు, క్రికెటర్లు, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లయినా సరే హైదరాబాద్ వచ్చారంటే చాలు.. ఇక్కడి బిర్యానీ తినకుండా వెళ్లలేని పరిస్థితి. కానీ ఇంతటి ఫేమస్ బిర్యానీ ఒక్క విషయంలో మాత్రం ఫెయిలైంది. తొలిసారిగా నిజాం నవాబులు హైదరాబాద్‌కు పరిచయం చేసిన ఈ బిర్యానీ.. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ సంపాదించలేకపోయింది. ఈ ట్యాగ్ కోసం హైదరాబాద్‌లోని అసోసియేషన్ ఆఫ్ బిర్యానీ మేకర్స్ వాళ్లు దరఖాస్తు చేశారు. తమకు 'హైదరాబాదీ బిర్యానీ' అనే ట్యాగ్ కావాలన్నారు. కానీ.. దాని మూలాలను నిరూపించే చారిత్రక సమాచారాన్ని అందించడంలో మాత్రం వాళ్లు విఫలమయ్యారు. దాంతో మన బిర్యానీకి జీఐ ట్యాగ్ రాలేదు.

ఏవైనా ఉత్పత్తులు ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయనుకుంటే వాటికి జీఐ ట్యాగ్ ఇస్తారు. అప్పుడు ఆ పేరును ట్యాగ్ పొందినవాళ్లు తప్ప వేరే ఎవ్వరూ వాడుకోడానికి వీలుండదు. హైదరాబాదీ బిర్యానీకి జీఐ ట్యాగ్ కావాలని మనవాళ్లు 2009 ఏప్రిల్‌లోనే దరఖాస్తు చేశారు. దాంతో.. తమ నిబంధనల మేరకు తగిన పత్రాలు అందించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. హైదరాబాదీ బిర్యానీకి సంబంధించిన చారిత్రక ఆధారాలు (గెజిట్ పబ్లికేషన్ల లాంటివి) సమర్పించాలని తెలిపింది. కానీ.. అలాంటివాటిని చూపించలేకపోయారు.

2010 ఆగస్టు నెలలో మరోసారి ఈ అంశం మీద చర్చ జరిగింది. అప్పుడు కూడా డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ బిర్యానీ తయారీదారుల సంఘం వాళ్ల నుంచి సమాధానం ఏమీ రాకపోవడంతో 2013 జూలైలో మరోసారి లేఖ రాశారు. దరఖాస్తులో ఉన్న లోటుపాట్లను సవరించాల్సిందిగా చెప్పారు. అయినా సమాధానం ఏమీ రాకపోవడంతో.. తమ సూచనలు పాటించడం లేదంటూ 2016 మే నెలలో ఇంకోసారి గట్టిగా చెప్పారు. ఈసారి కూడా సమాధానం ఏమీ రాకపోవడంతో ఈ సంవత్సరం జనవరి 23న చిట్టచివరిసారిగా షోకాజ్ నోటీసు జారీచేశారు. అప్పుడు కూడా సంఘం మౌనంగానే ఉండిపోయింది. దాంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పేశారు. దాంతో ఇక మన హైదరాబాదీ బిర్యానీకి జీఐ ట్యాగ్ రావడం కలలో కూడా జరగదని తేలిపోయింది.

Advertisement
Advertisement