ఫిరాయింపులపై ప్రధానికి ఫిర్యాదు : జానా | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై ప్రధానికి ఫిర్యాదు : జానా

Published Fri, Apr 15 2016 3:41 AM

ఫిరాయింపులపై ప్రధానికి ఫిర్యాదు : జానా - Sakshi

పార్టీలు మారేవారు రాజీనామా చేసి గెలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి హెచ్చరించారు. ఈ ఫిరాయింపులపై వెంటనే చర్యలు తీసుకునేలా, అనర్హత చట్టంలో అవసరమైన మార్పుచేర్పులు చేసేలా చూసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కలిసి కోరుతానని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీఏసీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ తదితరులతో కలిసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా నశించాయని విమర్శించారు. ‘‘పార్టీ మారేవారు, వారిని చేర్చుకునేవారు చేస్తున్న రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ వల్ల వచ్చిన పదవులకు రాజీనామా చేయాలి. తాము చేరిన పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలి’’ అని సవాలు విసిరారు. తాను కూడా పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలిచానని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్టీలు ఫిరాయిస్తున్నవారు ఎలాంటి నైతిక విలువలూ పాటించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు.

‘‘నూతన రాజకీయాలకు అంకురార్పణ చేయాల్సిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అసహ్యకర రాజకీయాలు జరగడం దురదృష్టకరం. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఫిరాయింపులతో కాంగ్రెస్‌కు జరిగే నష్టమేమీ లేదు. గతంలో రెండు లోక్‌సభ స్థానాలతో చిన్న పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలో ఉంది. తమిళనాడులో జయలలితా అంతే. పదవులు, అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నవారు అడ్రస్ లేకుండా పోవడం, విపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో సహజం. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా, ప్రజాస్వామికంగా వ్యవహరించామా లేదా అన్నది ముఖ్యం’’ అన్నారు.

కొత్తగా కోటి ఎకరాలెలా తెస్తారు?
సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో గొప్ప, కొత్త విషయాలేమీ లేవని జానా పెదవి విరిచారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటున్న కేసీఆర్, అసలు కొత్తగా కోటి ఎకరాలు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు. ‘‘ప్రజెంటేషన్ అంటే కంప్యూటర్లు, మ్యాపులు పెట్టే ఇవ్వాల్సిన అవసరం లేదు.సీఎం కంటే బ్రహ్మాండంగా, ప్రజలకు అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితులను వివరిస్తుంది. కొన్ని ప్రాజెక్టులను రీ డిజైన్ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. వాటిలోని సాంకేతిక మంచి చెడులపై నిపుణులతో లోతుగా చర్చిస్తున్నాం. నిజానికి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో, అహంకారంతో విర్రవీగుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్టు నిజంగానే కోటి ఎకరాలకు నీరు పారిస్తే మేం కొట్టుకుపోతాం. నీరు పారకపోతే ఆ బూటకపు ప్రచారంలో టీఆర్‌ఎస్ కొట్టుకుపోతుంది’’ అని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement