నా చేతులు కట్టేసి ఉన్నాయి | Sakshi
Sakshi News home page

నా చేతులు కట్టేసి ఉన్నాయి

Published Mon, Aug 17 2015 4:52 AM

నా చేతులు కట్టేసి ఉన్నాయి

- ఏపీకి ప్రత్యేక హైకోర్టుపై కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ
- కోర్టులో వివాదం తేలేదాకా ఏమీ చేయలేం
- ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
 
సాక్షి, హైదరాబాద్:
ఏపీకి ప్రత్యేక హైకోర్టు విషయంలో తన చేతులు కట్టేసి ఉన్నాయని, హైకోర్టు ఏర్పాటును కేంద్రం కీలకాంశంగా పరిగణిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేనన్నారు. ఆదివారం నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు.

హైకోర్టుకు స్థలం, వసతులు, నిధులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిం చాల్సి ఉంటుందన్నారు. భూమి, ఇతర సదుపాయాలు కల్పించే బాధ్యత ఏపీ సీఎందేనని హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు.

 

ఈ అంశంపై చర్యలకు గతంలో ఏపీ సీఎం, గవర్నర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఏపీ సీఎం నుంచి సమాధానం రాలేదన్నారు. ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, కొత్త హైకోర్టును ఏపీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా.. కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

Advertisement
Advertisement