'బీజేపీ మనిషిని కాదు' | Sakshi
Sakshi News home page

'బీజేపీ మనిషిని కాదు'

Published Thu, Jan 21 2016 11:25 AM

'బీజేపీ మనిషిని కాదు' - Sakshi

హైదరాబాద్‌: రోహిత్ ఆత్మహత్యకు కారణమయిన వారిలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావుకు రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఆయనకున్న రాజకీయ పలుకుబడి, సంబంధాలు, లాబీయింగ్ తోనే వీసీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అండతోనే ప్రొఫెసర్ అప్పారావుకు వైస్ ఛాన్సలర్ పదవి దక్కించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. తనకున్న రాజకీయ పలుకుబడితోనే 35 మంది పోటీదారులను ఎదుర్కొని ఆయన వీసీ పీఠాన్ని అధిరోహించారని అంటున్నారు. వెంకయ్య అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే గతేడాది సెప్టెంబర్ 15న హెచ్ సీయూకు అప్పారావు వీసీ కాగలిగారని వర్సిటీ సిబ్బందిలో కొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరుకు చెందిన అప్పారావు రెండు దశాబద్దాలుగా హెచ్ సీయూలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2001-2004లో హెచ్ సీయూ హాస్టల్ కు ఆయన చీఫ్ వార్డెన్ గా వ్యవహరించారు. బలమైన లాబీయింగ్ నేతగా పేరు గాంచిన టీడీపీ మాజీ ఎంపీకి బంధువు కావడంతో రాజకీయ ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీసీ పదవికి అప్పారావు పేరును స్మతి ఇరానీకి వెంకయ్య నాయుడు సూచించారని తెలిపాయి. అప్పారావుకు చంద్రబాబు అండ కూడా ఉందని పేర్కొన్నాయి.

అయితే తనకు రాజకీయ నాయకులతో సంబంధాలు లేవని అప్పారావు తెలిపారు. తాను బీజేపీ మనిషి కాదని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement