శాఖలకు సారథులేరీ? | Sakshi
Sakshi News home page

శాఖలకు సారథులేరీ?

Published Wed, Apr 20 2016 3:43 AM

శాఖలకు సారథులేరీ?

రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత

 సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన, సమర్థవంతమైన పాలన కావాలంటే సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులూ ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా అఖిల భారత సర్వీసు అధికారుల కొరత వెంటాడుతూనే ఉంది. సరిపడే సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకపోవడంతో.. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రతిష్టాత్మక పథకాల పురోగతిపై ప్రభావం కనబడుతోంది.

రాష్ట్ర విభజన సమయంలో నిర్దేశించిన కేడర్ కేటాయింపు ప్రకారం తెలంగాణలో ఉండాల్సిన ఐఏఎస్‌ల సంఖ్య 163. కానీ ఉన్నది 128 మందే. అందులోనూ 13 మంది సీనియర్ అధికారులు డిప్యుటేషన్లపై కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. మరో నలుగురు ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్నారు. దీంతో ప్రధాన శాఖలు, డెరైక్టరేట్‌లు, కమిషనరేట్‌లన్నీ ఇన్‌చార్జుల పాలనలో నడుస్తున్నాయి. దీంతో అన్ని శాఖల్లో వేలాదిగా ఫైళ్లు పేరుకుపోతున్నాయి.

 అభ్యంతరంతోనే అడ్డంకి!
 ఐఏఎస్‌ల సంఖ్యను 167 నుంచి 211కు, ఐపీఎస్‌ల సంఖ్యను 112 నుంచి 141కి పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) జనవరిలోనే నిర్ణయం తీసుకుంది. మరో ఐదేళ్ల వరకు అదనంగా అధికారులను అడగొద్దనే షరతు విధించింది. అయితే పెంచిన సంఖ్యపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదేళ్లు కేడర్‌ను అడగొద్దనే షరతును వ్యతిరేకిస్తూ డీవోపీటీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కొత్త అధికారుల కేటాయింపుపై డీవోపీటీ వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలున్నాయి.

 రెండు మూడు బాధ్యతలు
 కీలకమైన నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్‌కే జోషి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ అదనంగా దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుల్లో ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ పరిశ్రమల శాఖ ఇన్‌చార్జిగా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి బాధ్యతలను ఆ శాఖ కమిషనర్ రజత్ కుమార్‌కే అప్పగించారు. సీనియర్ ఐఏఎస్ సోమేష్‌కుమార్ బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

హైదరాబాద్ జలమండలి ఎండీ దానకిశోర్ పురపాలక శాఖ డెరైక్టర్ అండ్ కమిషనర్‌గా ఉన్నారు. గతంలో హౌజింగ్ కార్పొరేషన్‌కు ఎండీ, హౌజింగ్ విభాగానికి కార్యదర్శిగా వేర్వేరు ఐఏఎస్ అధికారులుండగా ఇప్పుడు అశోక్‌కుమార్ ఒక్కరే ఈ రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు సీనియర్ ఐఏఎస్‌లు ప్రదీప్ చంద్ర, రేమండ్ పీటర్ ఈ ఏడాదిలోనే రిటైరవనున్నారు. రెండు నెలల కింద సెలవుపై వెళ్లిన ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి ప్రదీప్‌చంద్ర ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. క్యాట్ తీర్పు నేపథ్యంలో ఎస్‌ఎస్ రావత్ త్వరలో తెలంగాణకు రానున్నారు. వీరిద్దరికీ పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు పలువురు ఐఏఎస్‌ల బదిలీకి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు.

 కష్టనష్టాల ఆర్టీసీకి నాన్ కేడరేనా?
 ఇక మరోవైపు ఐపీఎస్‌ల కొరత వెంటాడుతూనే ఉంది. హైదరాబాద్ రేంజ్ ఐజీ, డీజీ పోస్టులు రెండు ఖాళీగానే ఉన్నాయి. ఈ రెండింటికీ వరంగల్ రేంజ్ ఐజీగా నవీన్‌చంద్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ డెరైక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రజా రవాణాకు కీలకమైన ఆర్టీసీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు బదులు నాన్‌కేడర్ అధికారిని ప్రభుత్వం జేఎండీగా కొనసాగిస్తుండడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement